
అమన్ (జోర్డాన్): ఆసియా అండర్–15, 17 చాంపియన్‌షిప్‌లో ఇండియాకు మరో నాలుగు స్వర్ణాలు లభించాయి. గురువారం జరిగిన అండర్–17 ఫైనల్లో ఖుషి చంద్ (46 కేజీ) 3–2తో అల్తాంజుల్ అల్తంగాదాస్ (మంగోలియా)పై, అహాన శర్మ (50 కేజీ), జన్నత్ (54 కేజీ) తమ ప్రత్యర్థులపై 5–0తో నెగ్గారు. 80+ కేజీల్లో అన్షిక ఆర్‌ఎస్‌సీ ద్వారా జానా అలవ్నే (జోర్డాన్)ను ఓడించి నాలుగో గోల్డ్‌ను అందించింది.
బాయ్స్ అండర్–17లో దేవాన్షు (80 కేజీ) 0–5తో ముఖమెదలి రుస్టెంబెక్ (కజకిస్తాన్) చేతిలో ఓడి సిల్వర్‌తో సంతృప్తిపడ్డాడు. దీంతో బాయ్స్ టీమ్ ఒక సిల్వర్, ఆరు బ్రాంజ్ మెడల్స్‌ను సాధించింది. సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీ), హర్సిక (63 కేజీ)లకు సిల్వర్ మెడల్స్ దక్కాయి. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా 15 స్వర్ణాలు, 6 రజతాలు, 22 కాంస్యాలతో మూడో స్థానంలో నిలిచింది. కజకిస్తాన్ టాప్‌లో నిలవగా ఉజ్బెకిస్తాన్ మూడో ప్లేస్‌తో సరిపెట్టుకుంది.