గొర్రెల స్కీమ్ అవినీతిలో.. నలుగురు ఆఫీసర్ల అరెస్ట్

గొర్రెల స్కీమ్ అవినీతిలో.. నలుగురు ఆఫీసర్ల అరెస్ట్

 

  • రూ.2.10 కోట్లు కొట్టేసినట్టు గుర్తించిన ఏసీబీ
  • ఏపీలోని బినామీ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్​ఫర్
  • బాధిత రైతుల ఫిర్యాదుతో స్కామ్ వెలుగులోకి
  • నిందితుల్లో ఇద్దరు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: గొర్రెల పంపిణీ పథకం స్కామ్​లో పశు సంవర్ధక శాఖలో పని చేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులను గురువారం ఏసీబీ అరెస్ట్ చేసింది. నలుగురు కలిసి రూ.2.10 కోట్లు కొట్టేసినట్టు గుర్తించింది. కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ పసుల రఘుపతి రెడ్డి, నల్గొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేశ్​లు గ్యాంగ్​గా ఏర్పడి ప్రభుత్వ నిధులు కాజేసినట్టు ఏసీబీ తేల్చింది.

 నలుగురిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ అకౌంట్లు క్రియేట్ చేసినట్టు ఏసీబీ అధికారులు కోర్టుకు వివరించారు. గొర్రె పిల్లలను విక్రయించిన రైతులకు చేరాల్సిన రూ.2.10 కోట్లు కాంట్రాక్టర్​తో కలిసి కొట్టేసినట్టు రిమాండ్ డైరీలో వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు. బినామీ అకౌంట్ హోల్డర్లు ఏపీకి చెందిన వారు కావడంతో వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

గోల్‌‌మాల్‌‌ ఇలా..

బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. గొర్రె పిల్లలు కొనేందుకు కొండాపూర్​లోని ‘లోలోనా ది లైవ్’ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన సయ్యద్ మొయిద్‌‌తో పాటు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవి కుమార్, ఆదిత్య కేశవ సాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. 

2017 నుంచి గొర్రెలను సప్లయ్ చేస్తున్న 18 మంది రైతుల వద్ద 133 యూనిట్ల గొర్రెలు కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన రూ.2.10 కోట్లు వారి అకౌంట్స్‌‌లో డిపాజిట్ చేస్తామని చెప్పారు. నలుగురు అధికారులు కలిసి తమకు తెలిసిన వారి పేర్లతో బినామీ అకౌంట్లు ఓపెన్ చేశారు. రైతులకు చేరాల్సిన డబ్బులను వారి అకౌంట్లకు ట్రాన్స్​ఫర్ చేశారు. బినామీ అకౌంట్ హోల్డర్లనే గొర్రె పిల్లలు అమ్మిన రైతులుగా రికార్డుల్లో చూపారు. అసలైన రైతులకు డబ్బులు ఇవ్వలేదు. అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడంతో ఆలస్యమైంది.

ఏసీబీ ఎంట్రీతోఅధికారుల గుట్టురట్టు

ఎలక్షన్స్‌‌ కోడ్‌‌ ముగిసిన తర్వాత కూడా అధికారులు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయలేదు. దీంతో బాధిత రైతులు మాసబ్ ట్యాంక్​లోని పశుసంవర్ధక శాఖ ఆఫీస్​కు వెళ్లి ఆరా తీశారు. తమకు రావాల్సిన రూ.2.10 కోట్లు ఏపీలోని వివిధ జిల్లాలోని వేర్వేరు అకౌంట్స్‌‌లో డిపాజిట్‌‌ అయినట్లు గుర్తించారు. డిసెంబర్‌‌‌‌లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకుని ఏసీబీకి బదిలీ చేసింది. 

దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలు అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌‌ఫర్ అయినట్లు గుర్తించారు. గొర్రెలు విక్రయించిన 14 మంది రైతుల స్టేట్‌‌మెంట్లను రికార్డ్‌‌ చేశారు. కాంట్రాక్టర్ మొయిద్‌‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. బినామీ అకౌంట్స్‌‌ క్రియేట్‌‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన అసిస్టెంట్ డైరెక్టర్లు రవి కుమార్, కేశవ సాయిలు సహా‌‌ రఘుపతి రెడ్డి, సంగు గణేశ్​లను తాజాగా అరెస్ట్ చేశారు.