పాస్​పోర్ట్ విచారణకు వెళ్లిన కానిస్టేబుల్ పై దాడి .. నలుగురు అరెస్ట్​

పాస్​పోర్ట్ విచారణకు వెళ్లిన కానిస్టేబుల్ పై దాడి .. నలుగురు అరెస్ట్​

మలక్ పేట, వెలుగు: మలక్​పేట పోలీస్​స్టేషన్​పరిధిలో విచారణకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ పై నలుగురు దాడి చేయగా, నిందితులను అరెస్ట్​చేసినట్లు సీఐ నరేశ్​తెలిపారు. ముసారాంబాగ్​కు చెందిన గోగు అర్షిత పాస్​పోర్ట్​కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేసేందుకు సౌత్ ఈస్ట్ జోన్‌‌లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న టి. సర్వేశం సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఆమెకు ఫోన్ చేశాడు. అర్షిత తల్లి సునీత లిఫ్ట్​చేసి, అడ్రస్​చెప్పారు. 6 గంటలకు ఆయన ముసారాంబాగ్ లోని గీతాంజలి అడ్మైర్ అపార్ట్‌‌మెంట్ G-1కు వెళ్లారు. అర్షిత ఇంట్లో లేదు. ఆమె తల్లి, సోదరుడు ఉన్నారు. పాస్‌‌పోర్ట్ విచారణలో భాగంగా డాక్యుమెంట్లను పరిశీలించిన కానిస్టేబుల్​అదే అపార్ట్‌‌మెంట్‌‌లో నివసించే ఒకరిని సాక్షిగా పిలవమని చెప్పారు. 

దీంతో వారు అనిత అనే మహిళను పిలవడంతో వచ్చింది. వివరాలు అడుగుతుంటే ఇవన్నీ ఎందుకని ఆమె అభ్యంతరం చెప్పింది. ఇలా పరస్పరం వాదనలు జరిగి, చివరకు గొడవకు దారితీసింది. అనిత తన భర్త శ్రవణ్ కుమార్, తమ్ముళ్లు నరేశ్, శివ, శేఖర్‌‌ను పిలిచింది. వారు వచ్చి కానిస్టేబుల్ సర్వేశంను దూషించి, కొట్టారు. ఆయన దుస్తులు చించేశారు. తాను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పినా వినలేదు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన మలక్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అనిత, శ్రవణ్ కుమార్, నరేశ్, శివను అరెస్ట్ చేశారు.