మధ్యప్రదేశ్‌‌‌‌లో ఒకే కుటుంబంలో .. నలుగురు ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌‌‌‌లో ఒకే కుటుంబంలో .. నలుగురు ఆత్మహత్య
  • మృతుల్లో ఇద్దరు టీనేజర్లు..సల్ఫాస్ ట్యాబ్లెట్లు మింగినట్లు నిర్ధరణ

భోపాల్: మధ్యప్రదేశ్‌‌‌‌లోని సాగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శనివారం తేహర్ గ్రామంలో  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకున్నారు. చనిపోయినవారిలో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు. మృతులను మనోహర్ లోధి (45), అతని కూతురు శివాని (18), కొడుకు అంకిత్ (16), వారి నానమ్మ ఫుల్‌‌‌‌రాణి లోధి (70)గా పోలీసులు గుర్తించారు. వారంతా సల్ఫాస్ ట్యాబ్లెట్లు(పురుగుల మందు) మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని చెప్పారు. ఫుల్‌‌‌‌రాణి, అంకిత్‌‌‌‌లు అక్కడికక్కడే మృతిచెందగా, శివాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిందన్నారు.  మనోహర్ లోధిని సాగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు.  మనోహర్ భార్య కొద్ది రోజుల క్రితమే తన పుట్టింటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 

మనోహర్ సోదరుడు నందరామ్ సింగ్ లోధి..శనివారం తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో తన సోదరుడు వాంతులు చేసుకోవడం గమనించి, స్థానికుల సాయంతో  అంబులెన్స్‌‌‌‌కు సమాచారం ఇచ్చాడని పోలీసులు వివరించారు. అయితే, అంబులెన్స్ రాకముందే ఫుల్‌‌‌‌రాణి, అంకిత్ మరణించారన్నారు. ఖురై సివిల్ ఆస్పత్రి డాక్టర్ల  ప్రకారం..చనిపోయిన నలుగురూ సల్ఫాస్ ట్యాబ్లెట్లు మింగారని తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..ఆత్మహత్యల వెనుక కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు సూసైడ్​కు దారితీసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.