కరోనాతో ఒకే ఇంట్లో నలుగురి మృతి

 కరోనాతో ఒకే ఇంట్లో నలుగురి మృతి
  • 11 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత
  • నెల్లికుదురు మండల కేంద్రంలో ఘటన

మహబూబాబాద్: కరోనా మహమ్మారి ఒకే ఇంట్లో నలుగురిని బలి తీసుకుంది. అది కూడా 11 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరుగా నలుగురు కుటుంబ సభ్యులను మింగేసింది. నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగిన ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. తొలుత ఈనెల 2వ తేదీన కరోనాకు గురైన తండ్రి చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచారు. కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి తండ్రిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రెండు రోజులు కూడా గడవక ముందే ఆయన పెద్ద కుమారుడు కరోనాతో పోరాడుతు మృత్యుఒడిలోకి చేరిపోయారు. వారికి సేవ చేసిన చిన్న కుమారుడికి సైతం కరోనా సోకడంతో ఈనెల 11వ తేదీన కన్నుమూశాడు. కేవలం వారం రోజుల వ్యవధిలో భర్త, ఇద్దరు పెద్ద కుమారులను పోగొట్టుకున్న దుఃఖంలో మునిగిపోయిన భార్య కు కూడా కరోనా సోకింది. దీంతో బంధువులు స్థానికంగానే ఉంటే.. భర్త, ఇద్దరు పిల్లల మాదిరిగానే దూరమవుతారేమోనని భావించి హైదరాబాద్ కు తరలించారు. మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తుండగా ఇవాళ చికిత్స ఫలించక ఆమె కూడా తుదిశ్వాస విడిచింది. ఒకే కుటుంబానికి చెందిన భార్య భర్తలు.. వారి ఎదిగిన ఇద్దరు పెద్ద కొడుకులు కూడా 11 రోజుల వ్యవధిలో కరోనాతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఉదంతం స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రజల్లో గుబులు రేపింది.