కోర్టు ధిక్కార కేసులో నలుగురు పోలీసులకు జైలు

కోర్టు ధిక్కార కేసులో నలుగురు పోలీసులకు జైలు

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్డు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ను అమలు చేయని నలుగురు పోలీస్‌‌‌‌ ఆఫీసర్లపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌‌‌‌ సిటీ పోలీస్‌‌‌‌ జాయింట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ (గతంలో వెస్ట్‌‌‌‌జోన్‌‌‌‌ డీసీపీ) ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌‌‌‌ ఏసీపీ ఎం. సుదర్శన్, జూబ్లీహిల్స్‌‌‌‌ సీఐ ఎస్‌‌‌‌.రాజశేఖర్‌‌‌‌ రెడ్డి, ఎస్‌‌‌‌ఐ సీహెచ్‌‌‌‌ నరేష్‌‌‌‌కు నాలుగు వారాల జైలు శిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా విధించింది. తీర్పుపై అప్పీల్‌‌‌‌ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును ఆరు వారాలపాటు నిలిపివేస్తూ ఈ మేరకు హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ జి. రాధారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్‌‌‌‌ను ఆదేశించారు. వీరు ఉద్దేశపూర్వకంగానే చట్టాన్ని ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. 

ఇదీ కేసు..
భార్యాభర్తల వివాదంలో నిందితులుగా ఉన్న భర్త, అత్తకు సీఆర్‌‌‌‌పీసీ సెక్షన్‌‌‌‌ 41-ఏ కింద పోలీసులు నోటీసులు ఇవ్వలేదంటూ గతంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. సదరు నిందితులు జక్కా వినోద్ కుమార్ రెడ్డి, ఆయన తల్లి సౌజన్యా రెడ్డి తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్‌‌‌‌ దిల్‌‌‌‌జిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ అహ్లువాలియా వాదిస్తూ.. నిందితులకు పోలీసులు సెక్షన్‌‌‌‌ 41–ఏ కింద నోటీసులు ఇవ్వకపోవడం సుప్రీంకోర్గు గైడ్ లైన్స్ ను ఉల్లంఘించడమేనని అన్నారు. గతంలో బీహార్ వర్సెస్ అర్నేశ్ కుమార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్ ను గుర్తు చేశారు. పిటిషనర్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సీక్రెట్ గా ఉంచారన్నారు. హైకోర్టులోని కేసులో పోలీసులు కౌంటర్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారని, పిటిషనర్ల గురించి తెలిసినప్పటికీ కింది కోర్టులో నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారని చెప్పారు. వారెంట్‌‌‌‌ జారీ చేశారని, లుక్‌‌‌‌ఔట్‌‌‌‌ నోటీసు కూడా ఇచ్చారని వివరించారు. పిటిషనర్లు పరారీలో లేరని, పిటిషనర్‌‌‌‌ కూతురు బ్యాడ్మింటన్‌‌‌‌ శిక్షణ కోసం థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ వెళ్లారని వివరించారు. పోలీసులకు ఈ–మెయిల్‌‌‌‌ చేసినా, వినతిపత్రం ఇచ్చినా స్పందించలేదన్నారు. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా పోలీసులు చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేశారన్నారు. దీంతో పోలీసులు కావాలనే గైడ్ లైన్స్ ను ఉల్లంఘించారని తేల్చిన హైకోర్టు వారికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.