- ఆటో డ్రైవర్ హత్య కేసులో కోర్టు తీర్పు
సూర్యాపేట క్రైమ్, వెలుగు: ఆటో డ్రైవర్ హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్‌నగర్‌లోని జిల్లా రెండవ అదనపు కోర్టు న్యాయమూర్తి పి.శివరాం ప్రసాద్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఎస్పీ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం, 2016 ఏప్రిల్ 15న మేళ్లచెరువు మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన చాట్ల వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్‌ను హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన రెడపంగు కోటేశ్వరరావు కుట్ర పన్నాడు. తాను ప్రేమించిన మహిళతో వెంకటేశ్వర్లు సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో హత్యకు ప్లాన్ వేశాడు.
రెడపంగు కోటేశ్వరరావు, రెడపంగు శ్రీహరి, పెరిమి మహేశ్, కొత్తపల్లి నాగసైదులు సాయం కోరాడు. వీరంతా కలిసి వెంకటేశ్వర్లుకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి, విచక్షణా రహితంగా దాడి చేసి, నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. ఫోన్ కాల్స్, సిగ్నల్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 13 మంది సాక్షులను విచారించిన కోర్టు నలుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.వెయ్యి జరిమానా కూడా విధించింది.
