తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో తీవ్ర విషాదం నెలకొంది. స్వర్ణముఖి నదిలో ఈతకెళ్లి ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సహయంతో పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల ప్రకారం.. వేదాంతపురంలోని సీపీఆర్ విల్లాస్ వెనుక స్వర్ణముఖి నదిలో శుక్రవారం (అక్టోబర్ 24) సాయంత్రం ఏడుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో వరద ఉధృతికి యువకులు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. నీటిలో గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్ల సహయంతో నదిలో గాలింపు చేపట్టారు. క్షేమంగా బయటపడ్డ వారిని విష్ణు, మణిరత్నం, కృష్ణగా గుర్తించారు పోలీసులు. మిగిలిన వారికోసం గజ ఈతగాళ్లు, డ్రోన్ల సహయంతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
