ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు

ప్రసాదంగా 45 టన్నుల లడ్డూలు

 అయోధ్య: శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు వచ్చే భక్తులకు ప్రసాదంగా లడ్డూలను అందించనున్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందుకోసం గుజరాత్, వారణాసిలలోని స్వీట్స్ తయారీదారులకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. మొత్తంగా ప్రారంభోత్సవ వేడుకలకు 45 టన్నుల లడ్డూలను తయారు చేయిస్తున్నట్లు పేర్కొంది. స్వచ్ఛ మైన దేశీ నెయ్యితో తయారు చేయిస్తున్న ఈ లడ్డూలను రాముడికి ప్రసాదంగా అర్పించాక, భక్తులకు పంచిపెట్టనున్నట్లు వెల్లడించింది. 

మరోవైపు, అయోధ్య రాముడికి లక్ష లడ్డూలను ప్రత్యేకంగా చేయించి పంపనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ప్రకటించింది. మధ్యప్రదేశ్​ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయం నుంచి కూడా అయోధ్యకు లడ్డూ ప్రసాదం అందనుంది. రాముడికి 5 లక్షల లడ్డూలను ప్రసాదంగా అందించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్​ శుక్రవారం వెల్లడించారు.

ఐఫిల్​ టవర్ ముందు రాముడి రథయాత్ర

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో ఇటీవల భారీ కార్ల ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మక టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక, అయోధ్యలో వేడుకలకు ముందురోజు.. ఈ నెల 21న పారిస్ లో రథయాత్ర నిర్వహించనున్నట్లు అక్కడి హిందూ కమ్యూనిటీ వెల్లడించింది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఐఫిల్​ టవర్ నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపింది.