పారిపోకుండా ఉన్నోళ్లకు బోనస్

పారిపోకుండా ఉన్నోళ్లకు బోనస్

క్వారంటైన్ ఆంక్షలతో ఉద్యోగులు పారిపోవడంతో కంపెనీ నిర్ణయం

హాంకాంగ్ : కఠినమైన క్వారంటైన్ ఆంక్షలు తట్టుకోలేక ఉద్యోగులు పారిపోతుండడంతో ఫాక్స్​కాన్​ కంపెనీ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. సెంట్రల్ చైనాలోని కంపెనీ ప్లాంట్ లోనే ఉండి పనికి వస్తే, రోజూ ఇచ్చే బోనస్ కు నాలుగింతలు ఇస్తామని తెలిపింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి చైనా అత్యంత కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నది. లక్షలాది మందికి టెస్టులు నిర్వహిస్తున్నది. జెంగ్​ఝౌలోని ఫాక్స్​ కాన్​ కంపెనీలోనూ కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. ఉద్యోగులలో కొందరికి కరోనా సోకడంతో వైరస్ కట్టడికి గత నెల అక్టోబర్ మధ్యలో ఈ కంపెనీలో లాక్ డౌన్ విధించారు. అయితే, కఠినమైన ఆంక్షలు తట్టుకోలేక ఉద్యోగులు ప్లాంట్ నుంచి పారిపోయి కొన్ని వందల కిలోమీటర్లు నడిచి ఇండ్లకు చేరుకుంటున్నారు. ప్లాంట్ లో తమకు సరైన సౌలతులు లేవని, వైరస్ బారినపడకుండా ఉండేందుకు చాలినన్ని రక్షణ సదుపాయాలు లేవని సోషల్ మీడియాలో కొంతమంది వర్కర్లు పోస్టులు చేశారు.

వైరస్ భయంతో కొంత మంది కంపెనీ ఉద్యోగులు ఫెన్సింగ్​ దూకి పారిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫాక్స్ కాన్ కంపెనీ దిగి వచ్చింది. పనికి వచ్చే ఉద్యోగులకు మంగళవారం నుంచి 400 యువాన్లు (55 డాలర్లు. ఇప్పటిదాకా రోజూ వంద యువాన్లు ఇచ్చారు) ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ నెలలో 15 రోజులకన్నా ఎక్కువ పనిచేస్తే ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తామని, అటెండెన్స్ 100% నమోదైతే  15 వేల యువాన్లు ఇస్తామని ప్రకటించింది. ప్లాంట్​లో ఇప్పటిదాకా సీరియస్ ఇన్ఫెక్షన్లు కనబడలేదని, కరోనా నియంత్రణలోనే ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్లాంట్ మేనేజర్ ఒకరు తెలిపారు.