
హైదరాబాద్, వెలుగు: సమున్నతి, నాబార్డ్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో బుధవారం ఐదో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీఓ) కాన్‌క్లేవ్ మొదలయింది. ఈ సదస్సు ద్వారా విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులు, రైతు సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మహిళల పాత్రను కొర్టెవా అగ్రిసైన్స్ ప్రెసిడెంట్ సుబ్రతో వివరించారు.
ఈ కార్యక్రమంలో 'స్టేట్ ఆఫ్ ది సెక్టార్ రిపోర్ట్ 2025' 5వ ఎడిషన్ను విడుదల చేశారు. సమున్నతి సీఈఓ అనిల్ కుమార్ ఎస్జీ మాట్లాడుతూ, మార్కెట్లు చిన్న రైతులకు నిజంగా ఉపయోగపడేలా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. నేటి ప్రపంచంలో రైతులు ప్రపంచానికి పరిష్కారాలను అందించగలరని ఆయన తెలిపారు. ఎఫ్‌పీఓలను పెట్టుబడికి సిద్ధంగా, ప్రపంచంతో అనుసంధానించే విధంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.