
న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతిని గెలుచుకోవాలంటే ఆయన గాజాలో యుద్ధం ఆగేలా చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ అన్నారు. మంగళవారం న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫ్రాన్స్ కు చెందిన ‘బీఎఫ్ఎం టీవీ’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
‘‘తాను ఏడు యుద్ధాలను ఆపానని, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ట్రంప్ ఈ ఉదయం మాట్లాడారు. అయితే, గాజాలో హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపితేనే ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ దక్కించుకునే అవకాశం ఉంటుంది” అని అన్నారు. ఇజ్రాయెల్ కు అమెరికానే ఆయుధాలు సప్లై చేస్తున్నందున ఆ దేశ అధ్యక్షుడే ఈ యుద్ధాన్ని ఆపగలరని మాక్రాన్ అభిప్రాయపడ్డారు.