History of January 17 : ఫ్రాంక్లిన్ డే .. మూఢనమ్మకాలపై పోరాడిన రోజు ఇదే..!

History of  January 17 :  ఫ్రాంక్లిన్ డే .. మూఢనమ్మకాలపై పోరాడిన రోజు ఇదే..!

భూకంపాలు, పిడుగులు.. పాపాలు చేసిన వాళ్లను శిక్షించేందుకు దేవుడు ఉపయోగించే ఆయధాలని జనం నమ్మే రోజులవి. అలాంటి సమయంలో అద్భుతాన్ని సృష్టించాడు బెంజిమిన్ ఫ్రాంక్లిన్. భవనాలమీద పిడుగులు పడకుండా రక్షణ కొరకు 'లైట్నింగ్ రాడ్' కనుగొని మానవజాతికి పెద్ద సాయమే చేశా డాయన. ఆయన శాస్త్రవేత్త మాత్రమే కాదు.. రచయిత, వ్యాపారవేత్త అంతకు మించి మహా మేధావి.

జనవరి 17 ఆయన పుట్టినరోజు. ఫ్రాంక్లిన్ గౌరవార్థం ఈ రోజున 'ఫ్రాంక్లిన్ డే' జరుపుకుంటున్నాం. ఫ్రాంక్లిన్ డే మేధావులు, శాస్త్ర వేత్తలు సాధించిన విజయాలను విద్యార్థులు, పరిశోధకులు గుర్తు చేసుకుంటారు. అలాగే ప్రయోగాలు చేసే వాళ్లు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు.వాళ్లకూ ఫ్రాంక్లిన్ డే రోజున ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. 

ఫ్రాంక్లిన్1706 లో బోస్టన్​లోని ఓ పేద కుటుంబంలో పుట్టి.. వ్యాపారవేత్తగా ఎదిగాడు. చిన్నతనం నుంచే ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూ మేధావిగా గుర్తింపు పొందాడు. ఆయన మంచి రచయిత కూడా. ప్రఖ్యాత పెన్సిల్వేనియా యూనివర్శిటీని స్థాపించింది ఈయనే. మూఢనమ్మకాలపై రాజీలేని పోరాటం కొనసాగించిన ఆయన్ని ఆక్స్​ ఫర్డ్ యూనివర్సిటీ, రాయల్ సోసైటీలు అరుదైన గౌరవాన్ని ఇచ్చి సత్కరించాయి.

బాల పరిశోధకుల కోసం...

బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో.. పరిశోధనలపై ఆసక్తి చూపిస్తుంటారు కొందరు చిన్నారులు. అలాంటి మేధావుల కోసమూ ఒక రోజు ఉంది. జనవరి 17న బాల పరిశోధకుల దినోత్సవం. బెంజిమిన్ ఫ్రాంక్లిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును నిర్వహిస్తారు. ఆయన 11వ ఏట 'స్విమ్మింగ్ ఫ్లిప్స్' కనిపెట్టాడు. అందుకే పిల్లల్లో సృజనాత్మక పెంపొందించేందుకు ప్రోత్సాహం అందించేందుకు ఈరోజున కార్యక్రమాలు చేపడతారు.