ఆర్మీ ఆఫీసర్నంటూ.. నమ్మించి నట్టేట ముంచుతున్నరు

ఆర్మీ ఆఫీసర్నంటూ.. నమ్మించి నట్టేట ముంచుతున్నరు

బాచుపల్లికి చెందిన చంద్రమోహన్ ఓ ప్రైవేట్ ఎంప్లాయి. తన బడ్జెట్ మేరకు సెకండ్​ హాండ్​ కారు కొనాలనుకున్నాడు. ఓఎల్ఎక్స్ లో తక్కువ ధరకు దొరికే కండిషన్ లో ఉన్న కారును కొనాలనుకున్నాడు. అందుకోసం శనివారం ఉదయం ఓఎల్ఎక్స్ సైట్ లో అమ్మకానికి పెట్టిన కార్ల కోసం వెతికాడు. ఏపీ 28 డీఎక్స్​1180 నంబర్ గల ఆల్టో కారు అమ్మకానికి ఉండడంతో గమనించాడు. 2009 మోడల్ మారుతి ఆల్టో కారు ధర రూ.80 వేలు ఉంది. కేవలం 38 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినట్లు పోస్ట్ చేయడంతో కార్ బాగుంటుందని భావించాడు. ఆ కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుని ఫైనల్ రేట్ తెలుసుకునేందుకు ఆ సైట్​లో పేర్కొన్న 7827750843 నంబర్ కి చంద్రమోహన్ ఫోన్ చేశాడు.

ఇలా మొదలైంది
చంద్రమోహన్ ఫోన్​చేయడంతో అవతలి వ్యక్తి తన పేరు రతన్ లాల్ గా పరిచయం చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ అధికారినని చెప్పాడు. తనకు ఉత్తర్​ప్రదేశ్​కు ట్రాన్స్ ఫర్ కావడంతో తన ఆల్టో కారును అమ్మకానికి పెట్టినట్లు చెప్పాడు. ఆర్మీ అధికారినని చెప్పడంతో డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్ గానే ఉంటాయని భావించి కారు ధర రూ.60 వేలకు ఫిక్స్ చేసుకున్నారు. ఐతే ముందుగా తనకు రూ.3,100 డిపాజిట్ చేస్తే కారును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు తీసుకొస్తామని చెప్పాడు. తను ఆర్మీ అధికారిని కాబట్టి బయటకు రాకూడదని చంద్రమోహన్ ను సైబర్ దొంగ నమ్మించాడు. తన డ్రైవర్ కారు తీసుకొచ్చి అప్పగిస్తాడని చెప్పాడు. ముందుగా ఎయిర్ పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం రూ.3,100 తన అకౌంట్ కి గూగుల్ పే ద్వారా డిపాజిట్ చేయాలని సూచించాడు. సైబర్ మోసగాడి మాటలు నమ్మిన చంద్రమోహన్ 78277 50843 ఫోన్ నంబర్ తో గల ‘గూగుల్ పే’ అకౌంట్ కి రూ.3,100 డిపాజిట్ చేశాడు.

ఇదీ స్కెచ్ వేశారు
డబ్బు డిపాజిట్ ఐన తరువాత శనివారం చంద్రమోహన్ కి కాల్ వచ్చింది. దాని సారాంశం‘‘ మీ డిపాజిట్ చేసిన డబ్బు నాకు చేరింది. డ్రైవర్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కారుతో స్టార్ట్ అయ్యాడు, అతడితో మాట్లాడండని’’ ఫోన్ మరో వ్యక్తికి ఇచ్చాడు. అవతలి వ్యక్తి తను కార్ డ్రైవర్ నని చెప్పి ఉదయమే ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పాడు. డ్రైవర్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి అర్ధగంట తరువాత చంద్రమోహన్ కి మరో కాల్ చేశాడు.  డాక్యుమెంట్స్ తయారు చేయడం కోసం రూ.13,999, ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేసి జీపీఎస్ కోసం రూ.17,500 లు తమ ఓనర్ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేయాలని చెప్పాడు. దీంతో డ్రైవర్ మాటలు నమ్మిన చంద్రమోహన్ రెండు విడతల్లో రూ.31,500 రతన్ లాల్ గూగుల్ అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేశాడు.

కార్ డెలివరీకి చేస్తున్నామని నమ్మించారు
మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చంద్రమోహన్ కి డ్రైవర్ మరో కాల్ చేశాడు. తను కూకట్ పల్లి దగ్గర్లోనే ఉన్నట్లు నమ్మించాడు. ఈ సారి సర్వీస్ టాక్స్ రూ.19 వేలు, కమర్షియల్ టాక్స్ రూ.21 వేలతో పాటు కారు ట్రాన్స్ ఫర్ డాక్యుమెంట్లపై సంతకాల కోసమని మరో రూ.16,750 వసూలు చేశారు. ఇలా మొత్తం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.1,10,395ల నగదును గూగుల్ పే ద్వారా వసూలు చేశారు. తమపై అనుమానం రాకుండా ఉండేందుకు చంద్రమోహన్ నివాసం ఉండే పరిసర ప్రాంతాల అడ్రస్సే చెప్పాడు. కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నానని చెప్పిన కారు డ్రైవర్ శనివారం రాత్రి వరకూ రాకపోవడంతో చంద్రమోహన్ కి అనుమానం వచ్చింది.