నకిలీ పాస్​బుక్​లతో బ్యాంకుకు కోట్ల టోకరా

V6 Velugu Posted on Nov 26, 2021

  • నకిలీ పాస్​బుక్​లతో బ్యాంకుకు టోకరా
  • ఊట్కూర్​ ఎస్బీఐలో రూ. కోట్లలో మోసం
  • బ్రోకర్లు, కొందరు బ్యాంకు సిబ్బంది చేతివాటం
  • లోన్లు చెల్లించాలంటూ అసలు రైతులకు నోటీసులు

నారాయణ పేట/ఊట్కూర్, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూర్​ మండలంలోని ఎస్బీఐ బ్యాంకులో నకిలీ పాస్​బుక్​లతో పెద్దఎత్తున లోన్లు తీసుకున్నారు. లోన్​ చెల్లించాలంటూ రైతులకు నోటీసులు రావడంతో విషయం బయటపడింది. ఊట్కూర్​ఎస్బీఐ బ్యాంకులో 2017 నుంచి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను సృష్టించి ఒక్కో రైతు పేరున రూ.40 వేల నుంచి లక్షన్నర వరకు క్రాప్​లోన్లు తీసుకున్నారు. ఇలా ఊట్కూర్​ మండలంలోని తిప్రాస్​పల్లి, పెద్దపొర్ల, ఊట్కూర్, అమీన్​పూర్​గ్రామాలతో పాటు మక్తల్​మండలం మంతన్​గోడ్, ఎర్నాగన్ పల్లి గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది రైతుల పేరు మీద రూ. 2 కోట్లకు పైగా తీసుకున్నారు. లోన్లు కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు వారం రోజులుగా ఆయా గ్రామాల్లోని రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా ఎవరూ కట్టకపోవడంతో గ్రామాలకు వెళ్లి లోన్​కట్టాలని అడగటంతో తాము అసలు లోన్​తీసుకోలేదని రైతులు పేర్కొంటున్నారు. 

నకిలీ స్టాంపులు.. ఫోర్జరీ సంతకాలు
మక్తల్​పట్టణ కేంద్రంగా రైతుల పేర్లపై నకిలీ పాసు పుస్తకాలను పుట్టించారు. వాటిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇందులో మంతన్​గోడ్​గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో నకిలీ నోట్ల వ్యవహారంలో వీరు పట్టుబడడం గమనార్హం. మంతన్​గోడ్​గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర తహసీల్దార్, ఆర్డీఓకు సంబంధించిన ముద్రలతోపాటు ఆయా బ్యాంకులకు చెందిన ముద్రలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. వీరితో పాటు మక్తల్​ తహసీల్దార్​ఆఫీస్​లో గతంలో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేయడానికి సహకరించాడని, బ్యాంకు సిబ్బంది కొందరు వీరితో మిలాఖత్​అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రైతులకు తెలియకుండానే..
ఊట్కూర్​ మండలం తిప్రాస్​పల్లి గ్రామంలోనే దాదాపు వంద వరకు రైతుల పేర్ల మీద వారికి తెలియకుండా లోన్లు తీసుకున్నారు. తిప్రాస్ పల్లి  రైతులు పని కిష్టమ్మ, మార్కెట్ కృష్ణయ్య, జరిగేలి నరసింహ, సందపొళ్ల కిష్టమ్మ, సందపొళ్ల బాలప్పకు తెలియకుండానే క్రాప్ లోన్​తీసుకున్నారు. రైతులకు నోటీసులు వచ్చేవరకు వారి పేరు పై క్రాప్ లోన్ ఉన్నట్లు తెలియదు. ఊట్కూర్​ బ్యాంకు మేనేజర్​ గత మంగళవారం నుంచి లీవ్​లో ఉన్నారు. నకిలీ పాస్​బుక్​లతో లోన్లు తీసుకున్న విషయమై బ్యాంకు అధికారులు రహస్య విచారణ చేస్తున్నట్లు తెలిసింది. 

Tagged Telangana, farmer, fraud, Bank, Loans, Narayanapet, sbi bank, fake passbook, ootkuru

Latest Videos

Subscribe Now

More News