లక్ష అన్నరు.. 50 వేలు పోసిన్రు

లక్ష అన్నరు.. 50 వేలు పోసిన్రు
  • లక్ష అన్నరు.. 50 వేలు పోసిన్రు
  • భూపాలపల్లి జిల్లాలో లెక్కించిన మత్స్యకారులు
  • బయటపడ్డ కాంట్రాక్టర్ నిర్వాకం

 

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : చేప పిల్లల పంపిణీలో కాంట్రాక్టర్లు చేసే గోల్‌‌‌‌మాల్‌‌‌‌ సోమవారం భూపాలపల్లి జిల్లా గణపురంలో బయటపడింది. చేప పిల్లలను కౌంట్‌‌‌‌ చేస్తే సగానికి సగం మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లాలోని గణపురం రిజర్వాయర్‌‌‌‌లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. 6 బుట్టల్లో సుమారు 24 కిలోల చేప పిల్లలను చెరువులోకి వదిలారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత డీసీఎం వ్యాన్‌‌‌‌లో ఒక్కో డ్రమ్మును ఖాళీ చేస్తూ బరువు చూసుకుంటూ సొసైటీ సభ్యులు చేప పిల్లలను కౌంట్‌‌‌‌ చేయగా అసలు విషయం బయటపడింది.  

సగానికి సగం .. 
జిల్లాలోని 466 చెరువుల్లో కోటి 92 లక్షల చేపపిల్లలను పోయడానికి ఆంధ్రప్రదేశ్​కు చెందిన అశోక చక్రవర్తికి కాంట్రాక్ట్‌‌‌‌ దక్కింది. చిట్యాల మండలంలోని వెల్లంపల్లి నుంచి ఫిష్‌‌‌‌ సీడ్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ చేసేందుకు ఆయన కాంట్రాక్ట్‌‌‌‌ కుదుర్చుకున్నారు. గణపురం రిజర్వాయర్‌‌‌‌లో 13 లక్షల చేప పిల్లలు పోయాల్సి ఉండగా మొదటి రోజు డీసీఎం వ్యాన్‌‌‌‌లో 10 డ్రమ్ముల్లో లక్ష చేప పిల్లలను తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే మత్స్యకారులకు అనుమానం వచ్చి మొదటి జాలీలో చేప పిల్లలను వేసి కిలోకు ఎన్ని వస్తున్నాయో లెక్కించారు. 600 దాకా రావడంతో ఆ లెక్కన జోకి చేప పిల్లల సంఖ్యను సరి చూసుకున్నారు. మత్స్యకారులు చేప పిల్లలను కౌంట్‌‌‌‌ చేస్తుండడంతో కాంట్రాక్టర్‌‌‌‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తం డ్రమ్ములు ఖాళీ అయ్యే సరికి 51,500 చేప పిల్లలు మాత్రమే లెక్కకు వచ్చాయి. ఈ విషయాన్ని సొసైటీ ప్రతినిధులు మత్స్యశాఖ ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయారు. ఈ లెక్కనే జిల్లా మత్స్య శాఖ ఆఫీసర్‌‌‌‌ అవినాశ్‌‌‌‌ ప్రకటించారు.  

సైజ్‌‌‌‌ కూడా తక్కువే
కాంట్రాక్టర్‌‌‌‌ తీసుకొచ్చిన చేప పిల్లల సైజ్‌‌‌‌ చాలా తక్కువగా ఉందని మత్స్యకారులు తెలిపారు. కాంట్రాక్టర్‌‌‌‌ ఒక డ్రమ్ములో మాత్రమే గవర్నమెంట్‌‌‌‌ చెప్పిన సైజు చేప పిల్లలను తీసుకొచ్చారన్నారు. మిగతా 9 డ్రమ్ముల్లో చాలా చిన్న సైజులో  చేప పిల్లలు ఉన్నట్లుగా మత్స్యకారులు తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేప పిల్లలు విడిచిపెట్టే సమయంలో పెద్ద సైజు చేప పిల్లలు తీసుకొచ్చి ...ఆయన వెళ్లిపోయిన తర్వాత చిన్న సైజు చేప పిల్లలు చెరువులో పోశారని మత్స్యకారులు ఆరోపించారు. ఈ చిన్న సైజు చేప పిల్లలు బయట మార్కెట్‌‌‌‌లో 30 నుంచి 50 పైసలకే దొరుకుతున్నాయని, ఇవి చెరువులో పోస్తే కిలో బరువు పెరగడానికి రెండేండ్లు పడుతుందన్నారు.