- ఫారెన్ వర్సిటీల స్టూడెంట్స్‌ను మోసగిస్తున్న గ్యాంగ్
- ఒకరు అరెస్ట్ .. పరారీలో మరో ఇద్దరు
హైదరాబాద్,వెలుగు : విదేశీ యూనివర్సిటీల్లో ఫీజు డిస్కౌంట్ ఇప్పిస్తమని మోసగిస్తున్న గ్యాంగ్ లో ఒకరిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ కవిత తెలిపిన ప్రకారం.. ఏపీకి చెందిన కనోల్ల అశోక్‌కుమార్ (28), ఢిల్లీకి చెందిన వక్వర్, అమెరికాలో ఉండే తరుణ్ ముగ్గురు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.
వీరు అమెరికాతో పాటు పలు దేశాల్లో చదువుతున్న విద్యార్థులు, కన్సల్టెన్సీల నుంచి ఫారెన్ స్టూడెంట్స్ డేటాను తీసుకుని కుటుంబ సభ్యులకు కాల్స్ చేసేవారు. సెమిస్టర్ ఫీజులో 10 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తమని ఆశ చూపించేవారు. ఫీజు కలెక్ట్ చేసే.. తమ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులకు ట్రాన్స్‌ఫర్ చేసేవారు. దీంతో సెమిస్టర్ ఫీజు చెల్లించినట్లు స్టేటస్ కనిపించేది. కానీ ఫీజు మాత్రం పెండింగ్‌లో ఉండేది. ఇలా ఇండియన్ స్టూడెంట్స్‌ను టార్గెట్ చేసి వరుస మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలా దొరికారు
సికింద్రాబాద్ పరిధి తిరుమలగిరికి చెందిన సుధాకర్ కొడుకు అమెరికాలోని వెస్ట్ ఫ్లోరిడా వర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. సుధాకర్‌కు రెండు నెలల కిందట అశోక్‌కుమార్ కాల్ చేశాడు. తాము కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. సెమిస్టర్ ఫీజులో 10 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తామని నమ్మించాడు. ఇలా రూ.4.38 లక్షలు వసూలు చేశాడు. సెమిస్టర్ ఫీజు పెండింగ్‌లో ఉండడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించాడు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి అశోక్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వక్వర్,తరుణ్ పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.
