రూ. 23 వేలు, బైక్‌‌తో పరార్

 రూ. 23 వేలు, బైక్‌‌తో పరార్

లింగంపేట, వెలుగు : తక్కువ ధరకు సిమెంట్‌‌ బస్తాలు ఇప్పిస్తానని చెప్పి రూ. 23 వేలు, బైక్‌‌తో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటన లింగంపేటలో శుక్రవారం జరిగింది. ఎస్సై శంకర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... లింగంపేటకు చెందిన తిదిరి చంద్రశేఖర్‌‌ వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తాను ఇల్లు కట్టుకోగా 100 బస్తాల సిమెంట్‌‌ మిగిలిందని, దానిని తక్కువ ధరకే ఇస్తానని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్‌‌ అంగడిబజార్‌‌లో కొత్తగా ఇల్లు కడుతున్న రోహిత్‌‌ను కలిసి రూ. 100 తక్కువకే సిమెంట్‌‌ బస్తాలు ఇప్పిస్తానని రూ. 250 చొప్పున బేరం మాట్లాడుకున్నాడు. అరగంట తర్వాత​గుర్తు తెలియని వ్యక్తి రెండు వెహికల్స్‌‌లో సిమెంట్‌‌ బస్తాలను తీసుకొచ్చి రోహిత్‌‌ ఇంటి వద్ద 65 బస్తాలు దించి, రోహిత్‌‌ ఇంటి పక్కన ఉన్న అశోక్‌‌కు 35 బస్తాల సిమెంట్‌‌ ఇచ్చాడు. తర్వాత అతడు రోహిత్‌‌ వద్ద రూ.15 వేలు, అశోక్‌‌ వద్ద రూ.8500 లు తీసుకుని అంబేద్కర్‌‌ చౌరస్తాలో మా మేనేజర్‌‌ ఉన్నాడని అతడికి డబ్బులు ఇచ్చి వస్తానంటూ చంద్రశేఖర్‌‌కు చెందిన బైక్‌‌ను తీసుకొని వెళ్లాడు. తర్వాత సిమెంట్‌‌ బస్తాలకు చెందిన వ్యక్తి వచ్చి తనకు డబ్బులు అందలేదని బస్తాలను తిరిగి తీసుకెళ్లాడు. దీంతో మోసపోయామని గుర్తించిన చంద్రశేఖర్‌‌, అశోక్‌‌, రోహిత్‌‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శంకర్‌‌ తెలిపారు.