నా బాబుకి తల్లివవుతావా.. నా ఆస్తి రూ.14వేల కోట్లు

నా బాబుకి తల్లివవుతావా.. నా ఆస్తి రూ.14వేల కోట్లు

ఫేస్ బుక్, వాట్సాప్ పరిచయాలతో పెళ్లి పేరుతో కొందరు…సాయం పేరుతో మరి కొందరు మోసం చేస్తున్నారు. ఎదుటి వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకోకుండా పరిచయాలు పెంచుకోవడం చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా.. ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. చివరకు మోస పోయామని తెలుసుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా… అలర్ట్ గా ఉండాల్సింది పోయి మ్యాట్రిమోని ద్వారా పరిచయం అయిన ఓ నైజీరియన్ ను నమ్మి 6 లక్షల 28 వేల రూపాయలు అతనికి ఇచ్చి మోస పోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది.

ఒడిషా రాష్ట్రానికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. కొద్దినెలలకే భర్తతో విడిపోయింది. మూడు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేయడంతో చివరకు తన డిటేల్స్ ను భారత్‌ మాట్రిమోనిలో అప్‌లోడ్‌ చేసింది. నెల రోజుల క్రితం యష్‌ సలుజా పేరుతో ఓ యువకుడు ఆమెకు ఫోన్‌ చేశాడు. భారత్‌ మాట్రిమోనీలో మీ వివరాలు చూశానని చెప్పాడు. తాను అమెరికాలో ఉంటానని… ఐదేళ్ల క్రితం భార్య చనిపోయిందని…బాబు ఉన్నాడని తెలిపాడు. బాబును ప్రేమగా చూసుకుటావన్న నమ్మకం ఏర్పడిందని చెప్పాడు. ఇద్దరం పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడదామన్నాడు. అంతే కాదు తన తల్లి రెండేళ్ల క్రితం చనిపోతూ మలేసియా బ్యాంకులో రూ.14వేల కోట్లు డిపాజిట్‌ చేసిందని చెప్పాడు. ఆ డబ్బును తన ఖాతాల్లోకి వేయించుకునేందుకు మలేషియా వెళ్తున్నానని,  ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుందాని చెప్పాడు.

మలేషియాకు వెళ్తున్నానని బాధితురాలికి చెప్పిన నైజీరియన్‌.. ఈ నెల 9న ఫోన్‌ చేశాడు. రూ.14వేల కోట్ల కరెన్సీ తన ఖాతాలోకి రావాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని, రూ.2 లక్షలు ఇస్తే…మిగిలిన డబ్బును వేరే వారి దగ్గర తీసుకుంటానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితురాలు రూ.2లక్షల నగదు నిందితుడు చెప్పిన ఖాతాలో డిపాజిట్ చేసింది. రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి… మరో రూ.2 లక్షలు కావాలంటూ అడిగాడు. ఆ మొత్తాన్ని కూడా పంపించింది.  ఆ తర్వాత మే 14న మరోసారి బాధితురాలికి ఫోన్‌ చేసి.. ఇంకో 2లక్షల రూపాయలు సర్దితే… కేవలం మూడు గంటల్లో ఖాతాలో తిరిగి వేస్తానని నమ్మించాడు. డబ్బు లేకపోవడంతో ఆమె బంగారు నగలు అమ్మి మరీ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసింది. మరుసటి రోజు ఫోన్‌ చేసి రూ.30 వేలు తక్కువయ్యాయని ఎలాగైనా పంపించాలంటూ అతడు కోరగా… బ్యాంకులో ఉన్న నగదు నిల్వలు ఖాళీ చేసి రూ.28 వేలు పంపించింది. ఆ తర్వాత రోజు ఆమె ఫోన్‌ చేసి తన దగ్గర ఒక్కరూపాయి లేదని నగదు పంపించాలని కోరగా… తాను ఇచ్చే పరిస్థితిలో లేనని ఇంకా రూ.3లక్షలు కావాలని కోరాడు. దీంతో ఆమెకు అసలు విషయం అర్ధమైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని… పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ నైజీరియన్ అమెరికాలో కాదు..ఢిల్లీలో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు.. అరెస్ట్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు.