జూన్ 16న కింగ్​కోఠిలో ఫ్రీగా కృత్రిమ అవయవాలు పంపిణీ

 జూన్ 16న కింగ్​కోఠిలో ఫ్రీగా కృత్రిమ అవయవాలు పంపిణీ
  •     800 మందికి అందించాలని నారాయణ్ సేవా సంస్థాన్ నిర్ణయం

బషీర్ బాగ్, వెలుగు : ఈ నెల 16న కింగ్ కోఠిలోని గార్డెన్ ఫంక్షన్ ప్యాలెస్​లో ఉచితంగా నారాయణ్ లింబ్, కాలిపర్స్ ఫిట్‌‌మెంట్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉదయ్​పూర్​నారాయణ్ సేవా సంస్థాన్ డైరెక్టర్ దేవేంద్ర చౌబిసా, ప్రతినిధి జస్మత్‌‌భాయ్ పటేల్ తెలిపారు. శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 39 ఏండ్లుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దివ్యాంగుల కోసం తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న కింగ్​కోఠిలో లింబ్ మెజర్మెంట్ క్యాంప్​నిర్వహించామన్నారు.

మూడు వేల మంది దివ్యాంగులు కొలతలు ఇవ్వగా, వీరిలో 800 మంది రోడ్డు, ఇతర ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయినవారు ఉన్నారని తెలిపారు. ఆ 800 మందికి ఆదివారం కృత్రిమ అవయవాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. శిబిరం ప్రారంభ కార్యక్రమంలో అతిథులుగా గవర్నర్​రాధాకృష్ణన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొంటారని తెలిపారు. శిబిరానికి వచ్చే దివ్యాంగులకు ఉచిత భోజన ఏర్పాటు చేస్తున్నామన్నారు.