- భారీ వర్షాలతో చేపల పెంపకానికి అనువైన వాతావరణం
- ఉచిత చేప విత్తన పిల్లల విడుదల షురూ
- 54,407 మంది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి
మెదక్ / సంగారెడ్డి/ సిద్దిపేట, వెలుగు: సాగునీటి వనరుల్లో ఉచిత చేప పిల్లల విడుదల షురూ అయింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 4,578 చెరువులు, రిజర్వాయర్లు ఉండగా వాటిల్లో 11.42 కోట్ల చేప పిల్లలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 921 మత్స్య సహకార సంఘాల్లో 54,407 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉండగా, చెరువుల్లో, ప్రాజెక్టుల్లో ఉచిత చేప పిల్లల విడుదల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి లభించనుంది.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో చేప పిల్లల విడుదలకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,135 నీటి వనరులు ఉండగా ఇందులో రిజర్వాయర్లు 3, శాశ్వత నీటి వనరులు 79, సీజనల్ పరంగా పుష్కలంగా నీరుండే చెరువులు 1,025 ఉన్నాయి. ఇక మత్స్య సహకార సంఘాలు 234 ఉండగా వాటిల్లో 12,889 మంది సభ్యులున్నారు. కట్ల, రోహు, కొర్రమీను, మ్రిగాల, బంగారు తీగ వంటి 3.50 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు ప్లాన్ చేశారు. ప్రాథమిక మత్స్య సొసైటీల్లోని మత్స్యకారుల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. ప్రతి చెరువు వద్ద సైన్ బోర్డులను ఏర్పాటు చేసి చెరువు, గ్రామం పేరు, అందులో వదిలిన చేప పిల్లల సంఖ్య, చెరువు పరిధిని పొందుపరిచారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో 378 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 24,698 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలోని 1,715 చెరువులు, రిజర్వాయర్లలో 4.42 కోట్ల చేప పిల్లలను వదలడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో వచ్చే ఒకటి రెండు రోజుల్లో చెరువులు రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలనున్నారు. మొత్తం చేపల్లో 35, 40 ఎంఎం సైజు చేప పిల్లలు 1.79 కోట్లు, 80, 100 ఎంఎం సైజు చేప పిల్లలు 2.63 కోట్లు ఆయా చెరువులు, రిజర్వాయర్లలో విడుదల చేయనున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో 1,728 చేపల చెరువులు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు చెరువులన్నీ పూర్తిగా నిండాయి. ప్రస్తుత సీజన్లో ఆయా చెరువుల్లో 5.5 కోట్ల చేప విత్తన పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ఆఫీసర్లు పలుమార్లు టెండర్లు పిలిచినప్పటికీ చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు ఇతర జిల్లాల నుంచి జిల్లాలోని వనరుల్లో వదిలేందుకు అవసరమైన చేప విత్తన పిల్లలను సరఫరా చేయించాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకు 35 నుంచి 40 మిల్లీ మీటర్ల సైజు చేప పిల్లలు 2.14 కోట్లు, 80 నుంచి 100 మిల్లీ మీటర్ల సైజు చేప పిల్లలు 1.32 కోట్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 309 మత్స్య సహకార సంఘాలు ఉండగా, వాటిల్లో 16,820 మంది సభ్యులు ఉన్నారు. చెరువుల్లో ఉచితంగా చేప విత్తన పిల్లలు విడుదల చేయడం ద్వారా జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభించనుంది.
