మోకాలు, తుంటి మార్పిడి పేషెంట్లకు  ఇంప్లాంట్స్ ఫ్రీ 

మోకాలు, తుంటి మార్పిడి పేషెంట్లకు  ఇంప్లాంట్స్ ఫ్రీ 
  • ఇప్పటికే గాంధీలో ముగ్గురికి ట్రీట్‌‌మెంట్ 
  • ప్రతి 10 మంది వృద్ధుల్లో ముగ్గురికి సమస్యలు ఉంటాయని అంచనా 
  • పేషెంట్లను గుర్తించేందుకు ఊళ్లల్లో ఆర్థో క్యాంపులు  

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో మోకాలు, తుంటి మార్పిడి సర్జరీలు చేయించుకునే పేషెంట్లకు ఇంప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కృత్రిమ అవయవాలు) ఉచితంగా అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఆపరేషన్లు మాత్రమే ఉచితంగా చేస్తుండగా, పేషెంట్లు తమ సొంత ఖర్చులతో ఇంప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుక్కుంటున్నారు. దీంతో గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సర్జరీలు చేయించుకోవడానికి పేషెంట్లు రావడం లేదు. దీనిపై ఇటీవల మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు రివ్యూ చేశారు. పదుల సంఖ్యలో ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్న గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద హాస్పిటళ్లలోనూ ఆపరేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై ఆయన ఆరా తీయగా.. పేషెంట్లు రావడం లేదని డాక్టర్లు చెప్పారు. ఇందుకు ఇంప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖరీదు కూడా ఒక కారణమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ఇంప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉచితంగా ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ఇంప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసే ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకోనున్నారు. ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్ల ప్రకారం ఇంప్లాంట్స్ కొనుగోలు చేయాలని హాస్పిటళ్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం ముగ్గురికి మోకీలు మార్పిడి సర్జరీలు చేశారు. ఈ ముగ్గురికీ ఇంప్లాంట్స్ ఉచితంగా అందజేశామని హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజారావు ‘వెలుగు’కు చెప్పారు. 

రూ.లక్షల్లో ఖర్చుతో పేదల ఇబ్బందులు.. 
రాష్ట్రంలో ప్రతి 10 మంది వృద్ధుల్లో కనీసం ముగ్గురు మోకీలు, తుంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఆరోగ్య శాఖ అంచనా వేసింది. ఈ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ట్రీట్ మెంట్ చేయించుకుంటుండగా, మిగిలిన ఇద్దరు సుదీర్ఘకాలం పాటు నొప్పితోనే నెట్టుకొస్తున్నారు. నొప్పి తగ్గించుకునేందుకు పెయిన్ కిల్లర్లు అతిగా వినియోగించి, చివరకు కిడ్నీలు పాడు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించుకోకపోవడానికి సర్జరీ, ఇంప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్చు కలిపి లక్షల్లో ఉండడం ప్రధాన సమస్యగా మారింది. అవయవ మార్పిడి ట్రీట్ మెంట్ పై ఉన్న అనుమానాలు, అపోహలు కూడా మరో కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన ఆర్థోపెడిక్ డాక్టర్ల రివ్యూలో ఈ అంశాలన్నీ చర్చకు వచ్చాయి. దీంతో గతంలో కంటి వెలుగు క్యాంపులు పెట్టిన మాదిరిగానే ఆర్థోపెడిక్ క్యాంపులు పెట్టాలని ఆయన ప్రతిపాదించారు. వీటికి ఆర్థోపెడిక్ డాక్టర్లు వెళ్లి సర్జరీలు అవసరమయ్యే పేషెంట్లను గుర్తించాలని సూచించారు. ఇలా గుర్తించిన పేషెంట్లకు ప్రభుత్వ దవాఖాన్లలో పూర్తి ఉచితంగా సర్జరీలు చేయనున్నారు. 

ఆరోగ్యశ్రీలో చేర్చాలంటున్న డాక్టర్లు.. 
ఉచితంగా ఇంప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించడం మంచి నిర్ణయమని ప్రభుత్వ డాక్టర్లు చెబుతున్నారు. అయితే హాస్పిటళ్ల వద్ద ఉన్న నిధులతోనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించిం దని, దీని వల్ల భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఇంప్లాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్చునూ చేర్చితే సమస్యలు ఉండవంటున్నారు. దీన్ని ప్రభుత్వ హాస్పిటళ్లకే పరిమితం చేయాలని, ప్రైవేటు హాస్పిటళ్లకు ఇవ్వొద్దని అంటున్నారు. అలా చేస్తేనే సర్కార్ దవాఖాన్లలో సర్జరీలు పెరుగుతాయని చెబుతున్నారు.