
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితులకు ఊరట కలిగిస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే కిడ్నీ బాధితులకు కొంత వరకు ప్రయోజనం చేకూరనుంది. తాజాగా మరుగుజ్జులకు 50 శాతం రాయితీ కల్పించారు. ఆ క్రమంలో కిడ్నీ బాధితుల బాధలను అర్థం చేసుకున్న ఆర్టీసీ.. ఫ్రీ జర్నీకి అవకాశం కల్పించింది.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ రెండు మూడేళ్లలో కిడ్నీ బాధితుల సంఖ్య వీపరీతంగా పెరిగిపోయింది. కొందరికి వారంలో రెండు, మూడు డయాలిసిస్ సేవలు అవసరమవుతున్న క్రమంలో ఇతరత్రా ఖర్చులతో పాటు రవాణా ఖర్చులు ఎక్కువ అవుతుండటంతో బాధితులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కిడ్నీ బాధితులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.
కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికోసం బస్సు పాసులు అందిస్తామన్నారు ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ. ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద డయాలసిస్ చేసుకునే దాదాపు 7,600 మందికి.. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగుతో పాటు హైదరాబాద్, వరంగల్ లో సిటీ బస్సుల్లో కూడా ఫ్రీ ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. దీని ద్వారా ఆర్టీసీపై పడే 12.22 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. రీయింబర్స్ మెంట్ ద్వారా ఆర్టీసీకి చెల్లించనున్నట్లు చెప్పారు. కిడ్నీ బాధితులకు ఉచిత ప్రయాణం కల్పించే విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు.