భక్తులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం దేవస్థానం. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఇవాళ్టి ( డిసెంబర్ 1 ) నుంచి భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.500 రూపాయలు టికెట్ తీసుకునే భక్తులకు రెండు లడ్లు, 300 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులకు ఒక లడ్డు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు అధికారులు.
శ్రీశైలం ఆలయంలో ఆధునిక పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు. అంతే కాకుండా మల్లన్న భక్తుల సౌకర్యార్థం డొనేషన్ కౌంటర్, కంకణాల కౌంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిపాలన భవనంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోటుగుంట రమేష్ నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొననున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాంచీని శనివారం నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిట్ జనరల్ మేనేజర్ మాన్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగర్ నుంచి శ్రీశైలం వరకు 110 కిలోమీటర్లు కృష్ణా నదిలో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు.
ఈ సీజన్లో మొదటిసారి శ్రీశైలం వెళ్తున్న లాంచీలో జీఎం మాన్వి, సాగర్ లాంచీ యూనిట్ మేనేజర్ హరి, టూరిజం అధికారి రాజేశ్ ప్రయాణించారు. ఉదయం 9 గంటలకు 30 మందితో హిల్ కాలనీ నుంచి బయలుదేరిన లాంచీ సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది. రాత్రి శ్రీశైలంలో బస చేసి ఆదివారం ఉదయం మల్లికార్జునస్వామిని సందర్శకులు దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం నుంచి సాగర్ కు లాంచీ తిరిగి బయలుదేరుతుంది.
