
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
నిజామాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సమస్య రానీయొద్దని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసీల్దార్లను ఆదేశించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. లబ్ధిదారులు ఇసుక రవాణా చేసుకోడానికి ప్రత్యేక వేబిల్స్ ఇవ్వాలని, అసవసర కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. పర్మిషన్ల మాటున అక్రమ ఇసుక బిజినెస్ జరగడానికి వీలులేదన్నారు. ఇసుక తోలుకుంటున్న లబ్ధిదారులను కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంపీడీవో, ఎంపీవోలను కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు.
వర్షాలు అధికమైతే నదులు, వాగుల్లో ఇసుక తవ్వడానికి వీలుండదని, దానికి ముందే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇసుక నిలువలు పెట్టుకునేలా చూడాలన్నారు. కేవలం ఇసుక కారణంగా ఇంటి నిర్మాణ పనులు ఆగడానికి వీలులేదని, అలాంటి ఫిర్యాదులు తన వద్దకు రావొద్దని స్పష్టం చేశారు. అలాగే మొరం సేకరణకు సహకరించాలన్నారు. ఇండ్ల నిర్మాణాన్ని సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్న సంగతిని ఆఫీసర్లంతా గ్రహించాలని కోరారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ ఉన్నారు. జూన్ 3 నుంచి 20 దాకా భూభారతి సభలు జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ ఆదేశించారు.