బంజారాహిల్స్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం 74వ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. వారితోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తదితర సీపీఐ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..1948 తర్వాత హైదరాబాద్ ప్రజలు శ్వాస పీల్చుకుంటున్నారంటే కమ్యూనిస్టు నేతల త్యాగ ఫలితమేనని కొనియాడారు. చరిత్ర అనేది దాస్తే దాయేది కాదన్న ఆయన... కమ్యూనిస్టుల పోరాటం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని చెప్పారు. కమ్యూనిస్టులు మతపురమైన ఉద్యమం చేయలేదన్న ఆయన... నైజాం, రజాకర్లకు, భూస్వాములకు, జమీందారు వ్యవస్థకు, వెట్టి చాకిరి, బానిస తత్వాన్ని రూపుమాపేందుకు వ్యతిరేకంగా పోరాటం చేశారని స్పష్టం చేశారు. దేశంలో నయా ఉదారావాదంతో బతుకుతున్నామని, పేదవారి సంపద పెద్దవారి చేతిలో ఉందన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ను బీజేపీ నేతగా ప్రచారం చేస్తున్నారు..
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పులు చరిత్రాత్మకమైనవని ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రజా ఉద్యమాలకు ఎప్పుడు అండగా ఉన్నాడన్న సురవరం... కమ్యూనిస్టు నేతలు మట్టిలో పుట్టిన మాణిక్యాలని కొనియాడారు. చాకలి ఐలమ్మ గొప్ప కమ్యూనిస్టు ఉద్యమ నేత అని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎన్నో దేశాలలో జాతీయ ఉద్యమాలు కొనసాగాయని చెప్పారు. ప్రపంచంలోనే ధనవంతుడు నిజం నవాబన్నారు. బీజేపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాదును భారత దేశంలో విలీనం చేశాడని చెబుతున్నారు.. కానీ అది ఎంతవరకు నిజమని ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నేత అన్న సురవరం... ఆయనను బీజేపీ నేతగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదులో కమ్యూనిస్టులు బలపడుతున్నారని, ఆనాడు సర్దార్ వల్లభాయ్ కమ్యూనిస్టులను చంపించాడని చెప్పారు. ఎన్నికల్లో నెహ్రూ కంటె రావి నారాయణ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు సమయంలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారన్న ఆయన... 1952 ఎన్నికల్లో ముగ్గురు ముస్లింలు కమ్యూనిస్టు పార్టీ నుండి గెలిచారని తెలిపారు. నిజాం మీద వ్యతిరేక పోరాటం చేసింది కమ్యూనిస్టు నేతలేనని, బీజేపీ నేతలు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వందలాది ముంది యోధులు ప్రాణ త్యాగం చేశారని, వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారని సురవరం చెప్పుకొచ్చారు.
ఉచిత పథకాల వల్ల సామాన్య ప్రజలు సోమరి పోతులవుతున్నారు...
ఉచిత పథకాల వల్ల సామాన్య ప్రజలు సోమరి పోతులవుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మోడీ గవర్నమెంట్ లో 29 మంది వందల కోట్లు కొల్లగొట్టి విదేశాలలో కెళ్ళిపోయారు.. కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రజలలో కమ్యూనిస్టు భావజాలాలు ఉండకుండా బీజేపీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. ఎంఐఎం అగ్రనేతకు బీజేపీ ప్రధాని మోడీకి జిగిరి దోస్తాన్ అన్న నారాయణ... రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎంఐఎం ముసుగులో పడిపోయాడన్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి చంపేస్తున్నారు
తెలంగాణలో భూమికోసం, విద్యార్థులు ఉద్యోగం కోసం ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి చంపేస్తున్నారన్నారు. విద్యనభ్యసించడానికి విద్యార్థులను హాస్టల్లో చంపేస్తున్నారన్న కోదండరాం... సెప్టెంబర్ 17న ప్రజల వారసత్వం అని అన్నారు. తెలంగాణలో ప్రజలందరూ సమాన పరిపాలన గురించి సెప్టెంబర్ 17 చేస్తున్నారా లేక నిజాం నిరంకుశ పాలనకు సెప్టెంబర్ 17 చేస్తున్నారా అన్నది నిలదీయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారు
1947 ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ... హైదరాబాద్ కు స్వాతంత్రం రాలేదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. భారత దేశంలో హైదరాబాద్ విలీనాన్ని నైజాం రాజు వ్యతిరేకించాడని, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నేతలు సాయిధ పోరాటం గురించి ఎక్కడా ప్రస్తావన చేయడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం వచ్చి హైదరాబాద్ ను దేశంలో విలీనం చేయడమన్నది ఎంత దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తున్నారన్న చాడ వెంకట్ రెడ్డి... సాయిధ పోరాటం అనేది హిందూ, ముస్లిం చేసిన పోరాటమని ఎంఐఎం పార్టీ నేతలు అంటారు.. కానీ అది పచ్చి అబద్ధమని ఆరోపించారు. సాయిధ పోరాటంలో కమ్యూనిస్టు నేతలు వందల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని స్పష్టం చేశారు.
