వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ : హోం మంత్రి మహమూద్​ అలీ

వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ : హోం మంత్రి మహమూద్​ అలీ
  • త్యాగాల వల్లే తెలంగాణకు స్వేచ్ఛ
  • జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ
  • యోధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : మంత్రి హరీశ్ రావు
  • ఉమ్మడి జిల్లాలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

సంగారెడ్డి టౌన్, వెలుగు: వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యం సిద్ధించాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్​ అలీ అన్నారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన సమైక్యత  వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో  దేశానికే రాష్ట్రం దిక్సూచిగా ఉందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో కీలకమైన రోజని, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన దినమని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి,  కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్​ పాల్గొన్నారు.

తెలంగాణ ముఖచిత్రం మారింది..

సిద్దిపేట రూరల్ : ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడిన యోధులకు శిరస్సువంచి నమస్కరిస్తున్నానని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సమైక్యతా దినోత్సవాన్ని కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు. జాతీయ పతాకావిష్కరణ చేసి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి, రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి మారిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో జూన్ 2, 2014  స్వరాష్ట స్వప్నం సాకారమైందని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ముఖచిత్రం ఎంతోమారిందని, పచ్చని పొలాలతో, మౌలిక వసతులతో ప్రగతిబాటలో పయనిస్తుందన్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్యాగ్ లైన్లుగా ఉన్న జిల్లా కేంద్రం ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా, జిల్లా నలుదిక్కలా అభివృద్ధి వెలుగులు విరాజిల్లుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ,  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ. ఎన్. శ్వేత, అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో నాగరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

రూ.180 కోట్లతో మెదక్​ మెడికల్ కాలేజీ..

మెదక్ : రూ.180 కోట్ల ఖర్చతో మెదక్​ పట్టణంలో మెడికల్ కాలేజీ బిల్డింగ్​, ఎంబీబీఎస్​ స్టూడెంట్స్​ కోసం హాస్టల్​ నిర్మించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ తెలిపారు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్​   కలెక్టరేట్​ వద్ద జాతీయ జెండా ఎగుర వేశారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని జిల్లాలకు మెడికల్​ కాలేజీలు మంజూరు చేసిందన్నారు. మెదక్​ లో 30.3 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్​ కాలేజీ నిర్మించనున్నట్టు తెలిపారు. ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీజీఎఫ్​ నుంచి రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, జిల్లాలోని మిగితా మూడు మున్సిపాలిటీకు రూ.25 కోట్ల చొప్పున, 493 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున రూ.73.9 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశామన్నారు. పట్టణం చుట్టూ రూ.305 కోట్లతో రింగ్​ రోడ్డు నిర్మించనున్నట్టు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.   కార్యక్రమంలో జెడ్పీ చైర్​ పర్సన్​ హేమలత,   ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్​ రెడ్డి, మదన్​ రెడ్డి, కలెక్టర్​ రాజర్షిషా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్​ కలెక్టర్​లు వెంకటేశ్వర్లు, రమేష్, ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్​ చంద్రాగౌడ్, మున్సిపల్​ చైర్మెన్​ చంద్రపాల్, వైస్​ చైర్మెన్​ మల్లికార్జున్​గౌడ్​, మార్కెట్​ కమిటీ చైర్మెన్​ జగపతి,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మెదక్​లో..

మెదక్ టౌన్ : మెదక్​ పట్టణంలోని నూతన పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో జాతీయ సమైక్యతా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని గౌరవ వందనం స్వీకరించి... జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి జాతీయ సమైక్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్​లో ఏఎస్పీ మహేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బందితో కలిసి వేడుకలను నిర్వహించారు.

హుస్నాబాద్​ : ఆర్డీవో ఆఫీసులో డీఏవో అహ్మద్​ఖాన్​ జాతీయజెండాను ఎగురవేశారు. మున్సిపల్​ ఆఫీసులో మున్సిపల్​ చైర్​పర్సన్​ ఆకుల రజిత జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు.