గాంధీ, మండేలా పోరాటానికి గుర్తుగా ఫ్రీడమ్ ట్రోఫీ

గాంధీ, మండేలా పోరాటానికి గుర్తుగా ఫ్రీడమ్ ట్రోఫీ

క్రికెట్లో ఫ్రీడమ్ ట్రోఫీ గురించి మీకు తెలుసా...అదీ భారత జట్టు పాల్గొనే ఈ టెస్టు సిరీస్ గురించి మీకు తెలుసా.. అవును టీమిండియా, సౌతాఫ్రికా మధ్య ఫ్రీడమ్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. 2015లో బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా కలిసి ఈ ట్రోఫీని ప్రవేశపెట్టాయి. భారత్, సౌతాఫ్రికా దేశాల స్వాతంత్య్ర ఉద్యమ చిహ్నాలైన మహాత్మ గాంధీ, నెల్సన్ మండేలా స్పూర్తిగా ఈ ఫ్రీడమ్ ట్రోఫీని రెండు దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్నాయి. ఫ్రీడమ్ ట్రోఫీని గాంధీ మండేలా ట్రోఫీ అని కూడా అంటారు.  జాత్యాహంకారానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యాన్ని సాధించటంలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మ గాంధీ, నెల్సన్ మండేలాకు  నివాళిగా ఫ్రీడమ్ ట్రోఫీ జరుగుతుంది. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా..ఈ ఫ్రీడమ్ ట్రోఫీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

రెండు జట్లూ పైచేయి సాధించాయి..
2015-16లో  భారత్ ఆతిథ్యం ఇచ్చిన  మొట్టమొదటి సిరీస్ లో టీమిండియా విజయం సాధించింది. 4 మ్యాచ్ ల సిరీస్ ను భారత జట్టు 3-0తో కైవసం చేసుకుంది. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. ఆ తర్వాత 2017-18లో జరిగిన టెస్టు సిరీస్ కు సౌతాఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను సౌతాఫ్రికా 2-1తో దక్కించుకుంది. అనంతరం 2019-20లో ఇండియాలో జరగ్గా..భారత జట్టు 3-0తో క్వీన్ స్వీప్ చేసింది. చివరగా 2021-22లో సౌతాఫ్రికాలో నిర్వహించగా..ఈ సిరీస్ ను ఆతిథ్య జట్టు 2-1తో గెలుచుకుంది. 
 
అత్యధిక పరుగులు వీరుడు కోహ్లీ


ఫ్రీడమ్ ట్రోఫీ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా కోహ్లీ నిలిచాడు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 53.55 సగటుతో కోహ్లీ 964 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు,మూడు అర్ధ సెంచరీలు వచ్చాయి. ఈ ట్రోఫీలో అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 254*. కోహ్లీ తర్వాత  కెప్టెన్ డీన్ ఎల్గర్ 13 మ్యాచ్‌ల్లో 36.86 సగటుతో 811 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అటు ఈ ట్రోఫీ చరిత్రలో  అజింక్య రహానే అత్యధిక సెంచరీలు నమోదు చేశాడు. అతను మూడు సెంచరీలు కొట్టాడు. 

వికెట్లలో అశ్విన్ టాప్..


ఫ్రీడమ్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ నిలిచాడు. 12 మ్యాచుల్లో 20.01 సగటు, 2.52 ఎకానమీతో 56 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ సిరీస్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7/66.  ఈ ట్రోఫీ చరిత్రలో అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లలో పది వికెట్లు తీసిన ఏకైక బౌలర్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్  రబడ 44 వికెట్లతో సౌతాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రెండవ స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుత టైటిల్ హోల్డర్ దక్షిణాఫ్రికా
ప్రస్తుతం ఈ ట్రోఫీ దక్షిణాఫ్రికా దగ్గర ఉంది. 2021-22 ఎడిషన్‌లో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. మొదటి టెస్ట్‌లో ఓడిపోయిన సౌతాఫ్రికా..మిగతా రెండు టెస్టుల్లో గెలిచి..ట్రోఫిని సొంతం చేసుకుంది. పీటర్సన్ మూడు మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలున్నాయి. దీంతో అతను 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు.