కొత్త ఐటీ బిల్లులో ఎన్నో మార్పులు.. తగ్గిన పన్ను రేట్లు.. పెరిగిన రిబేట్లు

కొత్త ఐటీ బిల్లులో ఎన్నో మార్పులు.. తగ్గిన పన్ను రేట్లు.. పెరిగిన రిబేట్లు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాల నిరసనల మధ్య లోక్​సభలో గురువారం ఆదాయపు పన్ను (నం. 2) బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. ఇది వ్యక్తులు, కుటుంబాల పన్ను విధానాన్ని పూర్తిగా మార్చనుంది. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టాలను సరళతరం చేయడమే దీని లక్ష్యం. వేతన జీవులకు ఇది చాలా ప్రయోజనం చేకూరుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే, 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో 2026 ఏప్రిల్​ నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త ఐటీ బిల్లులోని  క్లాజ్ 202(ఐ) ప్రకారం కొత్త పన్ను విధానం ఉంటుంది. దీని కింద రూ. 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. రూ. 4,00,001 నుంచి రూ. 12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 5శాతం నుంచి 15శాతం వరకు పన్ను రేటు తగ్గుతుంది. 

రూ. 12 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి అధిక పన్ను భారాన్ని తగ్గించడానికి మార్జినల్ టాక్స్ రిలీఫ్ నిబంధన చేర్చారు. పాత, కొత్త పన్ను విధానాల్లోనూ ఈ బిల్లు కొన్ని మినహాయింపులను అందిస్తోంది. పాత విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ. 12,500 వరకు.. అంటే 100శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త విధానంలో ఈ ప్రయోజనం రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది. వారికి రూ. 60వేల వరకు గరిష్టంగా రిబేట్​ లభిస్తుంది. ఈ మార్పులు మధ్య ఆదాయ వర్గాలకు పెద్ద ఊరటనిస్తాయని, మరింత సమానమైన పన్ను వ్యవస్థను నిర్మిస్తాయని భావిస్తున్నారు.

ఆస్తి ఆదాయం
క్లాజ్ 20 ప్రకారం, ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను విధానంపై బిల్లులో వివరణ ఇచ్చారు. సొంత భవనాలు లేదా భూమి నుంచి వచ్చే ఆదాయంపై 'ఇంటి ఆస్తి నుంచి ఆదాయం' కింద పన్ను విధిస్తారు. ఇకనుంచి వార్షిక విలువ అనేది వాస్తవంగా వచ్చే లేదా ఊహాజనిత అద్దెలో ఏది ఎక్కువైతే దాని ప్రకారం ఉంటుంది.  వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే ఆస్తుల ఆదాయంపై వ్యాపార ఆదాయం కింద పన్ను వేస్తారు. ఆస్తి పన్నులో స్పష్టత, నిష్పాక్షికతను తీసుకురావడానికి ఈ సవరణ చేశారు.

ఈ బిల్లు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్​)ను పన్ను విషయంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్‌తో అనుసంధానిస్తుంది. పదవీ విరమణ సమయంలో పెన్షన్​ మొత్తంలో 60% వరకు పన్ను ఉండదు. మిగిలినది యాన్యుటీ, కొనుగోళ్ల కోసం ఉపయోగిస్తే పన్ను ఉంటుంది. ఉద్యోగి, యజమాని చెల్లింపులకు సెక్షన్లు 80సీసీడీ(1), 80సీసీడీ(2) కింద పన్ను మినహాయింపులు కొనసాగుతాయి.