
ఏ స్కూల్లో అయినా టీచర్ క్లాస్‌రూమ్‌కి రాగానే పిల్లలు ఏం చేస్తారు? ‘గుడ్ మార్నింగ్.. టీచర్..’ అని చెప్తారు. టీచర్ ‘గుడ్ మార్నింగ్.. సిట్‌డౌన్’ అని చెప్పగానే ‘థాంక్యూ.. టీచర్.. ’ అంటారు. ఏ స్కూల్లో అయినా టీచర్‌కి స్టూడెంట్స్‌కి ఇంతకు మించి పలకరింపు ఉండదు. కానీ ఈ స్కూల్లో మాత్రం ప్రత్యేకం. టీచర్స్.. పిల్లలు కోరుకున్న విధంగా పలకరిస్తారు. వాళ్లను మనసారా హత్తుకుంటారు. ఫ్రెండ్‌లాగా ఫిస్ట్‌బంప్ ఇస్తారు. హైఫై కొడతారు. స్కూల్లో టీచర్లందరూ పిల్లలకు ఫ్రెండ్స్‌లా మారిపోతారు. అదే ఈ స్కూల్ స్పెషాలిటీ.
యాదాద్రి జిల్లా అడ్డగూడూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అది. ఆ స్కూల్లో క్లాస్‌రూమ్‌కి వెళ్లగానే గోడ మీద నాలుగు బొమ్మలు అతికించి ఉంటాయి. షేక్ హ్యాండ్ , హార్ట్ సింబల్, ఫిస్ట్‌బంప్, హైఫై. ఒక్కో బొమ్మకు ఒక్కో అర్థం ఉంటుంది. పిల్లలు క్యూలో ఒక్కొక్కరుగా వచ్చి ఆ నాలుగు బొమ్మల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. హార్ట్ బొమ్మను సెలెక్ట్ చేసుకుంటే.. టీచర్ స్టూడెంట్‌కు హగ్ ఇస్తుంది. హైఫై సెలెక్ట్ చేసుకుంటే.. హైఫై ఇస్తుంది. ఆ స్కూల్లో ప్రతీ టీచర్ ఇలానే గ్రీట్ చేస్తారు. ఇది ఆ స్కూల్లో స్టార్ట్ చేసిన కొత్త కాన్సెప్ట్.
వాట్సాప్ వీడియో చూసి..
ఆ స్కూల్ ప్రిన్సిపాల్ రూపకు వాట్సాప్‌లో వచ్చిన ఒక వీడియో చూశాక వచ్చిన ఆలోచన ఇది. ‘హార్ట్ వామింగ్ గ్రీటింగ్స్’ అని విదేశాల్లోని కొన్ని స్కూళ్లల్లో అనుసరించే విధానం అది. ఆ వీడియోలో టీచర్ పిల్లలను వాళ్లకు నచ్చిన విధంగా గ్రీట్ చేస్తుంది. హగ్, హైఫై, ఫిస్ట్ బంప్, హ్యాండ్ షేక్ ఇలా వాళ్లు ఎలా కోరుకుంటే అలా. రోజూ ఇలా పలకరించడం ద్వారా పిల్లలు టీచర్‌తో ఎలాంటి బెరుకు లేకుండా ఫ్రెండ్లీగా గడుపుతారని, టీచర్లకు, స్టూడెంట్స్‌కు మధ్య ఉన్న దూరం తగ్గిపోతుందని ఆ కాన్సెప్ట్ ఉద్దేశం. ఆ వీడియో చూసిన వెంటనే ‘ఇలా మన స్కూల్లో కూడా చేస్తే బాగుంటుంది కదా!’ అనిపించింది ప్రిన్సిపాల్ రూపకు. అనుకున్న విధంగా తర్వాతి రోజు నుంచే అమలులో పెట్టారు.
ఇక్కడన్నీ మేమే..
పిల్లలకు టీచర్స్ అంటే భయం పోగొట్టేందుకు ఈ పలకరింపు చాలా బాగా పని చేస్తుందన్నారామె ‘‘మాది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి పిల్లలకు బడి, ఇల్లు రెండూ ఇక్కడే. వాళ్లు ఎప్పుడు మాతోనే ఉంటారు. ఇంటి దగ్గర ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అన్నీ మేమే. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎన్నో చెప్పుకోలేని సమస్యలుంటాయి. అలాంటివన్నీ మాతో ధైర్యంగా చెప్పుకోవాలంటే.. ఒక టీచర్‌లా కంటే, ఒక ఫ్రెండ్‌లా, ఒక అమ్మలా వాళ్లకు దగ్గరవ్వాలి. దానికి ఈ కాన్సెప్ట్ బాగా పనిచేస్తుంది అనిపించింది. అందుకే వెంటనే అమలు చేశాం.
టీచర్ కూడా ఫ్రెండే..
ఇక్కడ చదివే పిల్లలందరూ ఐదవ తరగతి అయిపోయిన వెంటనే ఈ స్కూల్ కి వచ్చి, టెన్త్‌క్లాస్ వరకు ఇక్కడే ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు ఇల్లు గుర్తుకు రాకుండా చేయాలి. ఆలా చేయాలంటే టీచర్లే పిల్లలతో స్నేహితుల్లా, బంధువుల్లా మెలగాలి. కానీ ప్రతి స్టూడెంట్‌కి టీచర్ , ప్రిన్సిపాల్ అంటే తెలియని భయం ఉంటుంది. అది పోగొట్టడానికి ఈ ప్రయత్నం చాలా బాగా ఉపయోగ పడింది. టీచర్‌ని హగ్ చేసుకున్న తర్వాత కొంత మంది పిల్లలు ఎమోషనల్‌గా ఫీలయ్యారు. అప్పటి వరకు ఉన్న భయం ఒక్క సారిగా మాయమైపోయిందని చెప్పారు. ఏదో సినిమాలో చెప్పినట్టుగా ‘హగ్’ ఒక మంత్రంలా పనిచేసింది. హగ్ ఒక్కటే కాదు ఏ పలకరింపైనా అంతే. టీచర్‌తో హైఫై కొట్టగానే టీచర్ కూడా మనకి ఫ్రెండే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి చిన్నచిన్న పలకరింపుల వల్ల టీచర్స్, స్టూడెంట్స్‌ల మధ్య అన్యోన్యత చాలా వరకు పెరుగుతుంది. దీని వల్ల మరో ప్రయోజనం ఏంటంటే.. టీచర్‌ని ఒక ఫ్రెండ్‌లా ఫీలైనప్పుడు ఆ టీచర్ చెప్పే సబ్జెక్టు మీద కూడా ప్రేమ పెరుగుతుంది. టీచర్ మీద భయంతో చదవడం కంటే ప్రేమతో చదవడం వల్ల సబ్జెక్టుని బాగా అర్థం చేసుకునే వీలుంటుంది.
భయం పోగొట్టడానికే..
ఇక్కడ మారుమూల పల్లెల నుంచి వచ్చే పిల్లలు ఎక్కువగా ఉంటారు. వచ్చిన కొత్తలో వాళ్లలో తెలియని భయం, బెరుకు ఉంటుంది. కొత్త ప్రదేశానికి వచ్చామన్న ఫీలింగ్ వాళ్లను మానసికంగా ఎంతో భయపెడుతుంది. అందుకే తరచూ పిల్లలతో కమ్యూనికేషన్ గేమ్స్ ఆడించడం, మేమే స్వయంగా వాళ్లతో ఆడడం చేస్తుంటాం. ఇలాంటి వాతావరణం పిల్లల్ని చాలా సమస్యల్నించి బయటపడేస్తుంది. తమ మనసులోని ఏ విషయమైనా భయం లేకుండా మాతో చెప్పుకోగలుగుతారు. క్లాసులో డల్‌గా, ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చునే పిల్లలు కూడా మెల్లగా నలుగురితో కలిసిపోతారు. వారిలో భయం, బెరుకు పోతాయి. నాలుగు మాటలు మాట్లాడగలుగుతారు” అని చెప్పారామె.