మార్చి 1 నుంచి రోజుకు రూ. 100 కోట్లు సీజ్

మార్చి 1 నుంచి రోజుకు రూ. 100 కోట్లు సీజ్
  •     ఇప్పటి వరకు రూ.4,650 కోట్లు స్వాధీనం: ఈసీ 
  •     లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే హయ్యెస్ట్

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రూ.4,650 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, మద్యం, ఇతర తాయిలాలు స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం వెల్లడించింది. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు రోజుకు రూ.100 కోట్ల చొప్పున సీజ్ చేసినట్టు తెలిపింది. లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పట్టుకోలేదని, ఇదే అధికమని చెప్పింది. 2019లో జరిగిన లోక్ సభ ఎలక్షన్స్ టైమ్ లో రూ.3,475  కోట్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. కాగా, ఈసారి ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19న ఫస్ట్ ఫేజ్ మొదలుకానుంది. ఇంకా ఎన్నికలు మొదలు కాకముందే ఇంత పెద్ద మొత్తంలో దొరకడం గమనార్హం. 

106 మంది ఉద్యోగులపై వేటు.. 

ఇప్పటి వరకు సీజ్ చేసిన దాంట్లో 45% డ్రగ్స్ ఉన్నాయని ఈసీ వెల్లడించింది. ‘‘మొత్తం రూ.4,650 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నాం. ఇందులో రూ.2,069 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.489 కోట్ల విలువైన మద్యం ఉన్నాయి. రూ.395 కోట్ల నగదు ఉంది. మిగతావి ఇతర తాయిలాలు” అని పేర్కొంది. జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా పట్టుబడిన వాటిలో 75% డ్రగ్స్ ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. లోక్ సభ ఎన్నికల్లో డబ్బు, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నామని, అన్ని రాష్ట్రాల్లో నిఘా పెట్టామని పేర్కొంది.