ఈ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు! లక్షల్లో గిఫ్ట్.. అమ్మాయితో చాట్: ట్విట్టర్లో వైరల్

ఈ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే చాలు! లక్షల్లో గిఫ్ట్.. అమ్మాయితో చాట్: ట్విట్టర్లో వైరల్

ఇప్పుడు దేశంలో టాయిలెట్ లేని ఇళ్లు ఉందేమో కానీ.. సెల్ ఫోన్ లేని ఇళ్లు మాత్రం దాదాపుగా ఉండకపోవచ్చు. 130 కోట్ల భారత జనాభాలో 65 కోట్ల మంది ఫోన్లు వాడుతున్నారని ఓ సర్వేలో తేలిన విషయం. దీన్ని బేస్ చేసుకుని కొన్నేళ్లుగా ప్రభుత్వ సేవలు మొదలు రాజకీయ పార్టీ సభ్యత్వాలు, ప్రజాభిప్రాయ సర్వేల వరకు ఓ టోల్ ఫ్రీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి చాలంటూ ట్రెండ్ నడుస్తోంది.

ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ.. ఆ చట్టంపై ప్రజల్లో మద్దతు కోసం అదే మిస్డ్ కాల్ పంథాను ఎంచుకుంది. జనవరి 3న టోల్ ఫ్రీ నంబర్ 8866288662 ప్రారంభించి.. CAAకి మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ క్యాంపెయిన్ షురూ చేసింది. ప్రజల్లో పౌరసత్వ చట్టంపై ఉన్న అయోమయ్యాన్ని తొలగించేందుకు తాము ఈ ప్రయత్నిస్తున్నామని బీజేపీ చెబుతోంది. ఇందులో భాగంగానే గడప గడపకు వెళ్లి CAAపై అవగాహన కల్పించాలని నిర్ణయించామని తెలిపింది. చట్టం గురించి వివరించి మద్దతు తెలిపే వాళ్లు 8866288662 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతామని స్పష్టం చేసింది.

ఆఫర్లంటూ ట్విటర్‌లో వైరల్

  • ఆరు నెలల పాటు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
  • మీ బ్యాంక్ అకౌంట్‌లోకి 15 లక్షల క్యాష్ గిఫ్ట్
  • నిరుద్యోగులైతే మంచి ఉద్యోగం ఖాయం
  • అందమైన అమ్మాయితే రొమాంటిక్ చాటింగ్ లేదా మాట్లాడే చాన్స్
  • మీకు కావాల్సిన డ్రింక్స్ నేరుగా ఇంటికే డోర్ డెలివరీ
  • ఉచితంగా రోజుకు 2 జీబీ మొబైల్ డేటా

8866288662 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఈ బంపర్ ఆపర్లు అంటూ ఫేక్ ట్విట్టర్ అకౌంట్లతో వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జనాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈ రకమైన ప్రచారం చేయిస్తున్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇది కావాలని బీజేపీపై సెటైర్లు వేయడానికి ఎగతాళిగా కొంతమంది ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజాయితీగా CAAకు వస్తున్న మద్దతును తప్పుదారి పట్టించాలనుకునే వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారమని కర్ణాటక బీజేపీ ఎంపీ శోభా కరంద్‌లాజే అన్నారు. ఈ పని చేస్తున్న వారిపై చర్యలకు ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.