
బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలోబాయ్ చిత్రాలను నిర్మించిన సెవెన్ హిల్స్ సతీష్.. దర్శకుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. గురువారం (అక్టోబర్ 23) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సతీష్ మాట్లాడుతూ ‘‘సోలోబాయ్’ మూవీ ఈవెంట్‌లో నా గురువు వీవీ వినాయక్ గారు సూచించిన విధంగా నేను దర్శకుడిని అవ్వాలనే ప్రయత్నాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా మొదలుపెడుతున్నా.
మూడు సినిమాల అనుభవంతో దర్శకుడిగా మారబోతున్నా. నా స్నేహితుల నిర్మాణంలో దర్శకుడిగా తొలిచిత్రం చేయనుండటం సంతోషంగా ఉంది. చాలా వేరియేషన్స్ ఉన్న స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా. సినిమా మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అలాగే నా బ్యానర్‌లో మరో రెండు సినిమాలు నిర్మించబోతున్నా. ఎడిటర్ ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ఒక సినిమా, రాజశేఖర్ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాల అప్‌డేట్స్ వచ్చే ఏడాది అనౌన్స్ చేస్తాం. ఇక నా ఫేవరెట్ హీరో నాని. ఆయనతో సినిమా చేయాలని ఉంది” అని చెప్పారు.