Nivin Pauly: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు సౌత్ ఇండియన్ స్టార్.. నివిన్ పౌలీ ఇంట్రెస్టింగ్ జర్నీ!

Nivin Pauly: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు సౌత్ ఇండియన్ స్టార్.. నివిన్ పౌలీ ఇంట్రెస్టింగ్ జర్నీ!

ప్రేమమ్... ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేండ్లు అయింది. కానీ ప్రేక్షకుల ప్రేమ ఆ సినిమాపై ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పదిహేనేండ్లుగా ఇండస్ట్రీలో రకరకాల పాత్రలు పోషిస్తూ అలరిస్తోన్న మలయాళ నటుడు నివిన్​ పౌలీ.. ‘ప్రేమమ్’ తెచ్చిన అభిమానాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. తన కెరీర్​లో కల్ట్​గా నిలిచిన ఆ సినిమాతోపాటు పర్సనల్ లైఫ్​ నుంచి రీసెంట్​గా వచ్చిన ‘ఫార్మా’ వరకు తన జర్నీలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో...

నివిన్ పౌలీ.. కొచ్చిలోని అలువలో పుట్టాడు. కేరళలోనే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశాడు. క్యాంపస్ ప్లేస్​మెంట్స్​ ద్వారా బెంగళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో ఎంప్లాయిగా చేరాడు. రెండేండ్లు సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పనిచేశాడు. 2010లో తన కాలేజీ ఫ్రెండ్ రీనా జాయ్​ని పెండ్లి చేసుకున్నాడు. సినిమాల్లో యాక్టింగ్ అనేది అనుకోకుండా వచ్చిన అవకాశమే. అదే అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఒకరోజు ‘మలర్వాడి ఆర్ట్స్​ క్లబ్​’లో ఆడిషన్స్ జరుగుతుంటే సరదాగా ఫ్రెండ్స్​తో కలిసి వెళ్లాడు. ఆరోజు రావాల్సిన మరో వ్యక్తి ఆడిషన్​ మిస్​ అయ్యాడు. దాంతో ఆ పాత్రలో నటించేందుకు నివిన్​ని ఆడిషన్ చేశారు. అలా మొట్టమొదటిసారిగా సిల్వర్​ స్క్రీన్​పై కనిపించాడు. అదే 2010లో యాక్టర్ వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్​లో వచ్చిన​ ‘ది మెట్రో’ సినిమా. దాని తర్వాత ‘సెవెన్స్’ అనే సినిమాలో నటించాడు. 2012లో రిలీజ్ అయిన ‘తట్టత్తిన్ మరయత్తు’ అనే సినిమా ఆ ఏడాది బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. అందులో తన పాత్రకు పేరొచ్చింది. 

ఇది వినీత్​ శ్రీనివాసన్​ డైరెక్షన్​లో వచ్చిన రెండో సినిమా కావడం విశేషం. నెక్స్ట్​ ఇయర్ కూడా కొన్ని సినిమాలు క్యూలో ఉండగా, ఫుల్ కాన్ఫిడెన్స్​తో ద్విభాషా చిత్రంలో నటించాడు. అదే 2013లో వచ్చిన ‘నేరమ్. అలా తమిళంలోనూ తన సత్తా చాటాడు. అయితే మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా కాలం పట్టింది. దాదాపు నాలుగేండ్ల తర్వాత 2017లో మరోసారి ‘రిచీ’తో తమిళ ప్రేక్షకులను పలకరించాడు. ఇన్నేళ్ల తర్వాత 2024లో మళ్లీ తమిళ సినిమాలో నటించాడు నివిన్. రీసెంట్​గా రూట్ మార్చి వెబ్​ సిరీస్​లో కనిపించాడు. ‘ఫార్మా’ అనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్​తో మొదటిసారి ఓటీటీ ఆడియెన్స్​ను పలకరించాడు. ప్రస్తుతం లోకేష్​ కనగరాజ్ కథతో బక్కియారాజ్​ డైరెక్షన్​లో ‘బెంజ్​’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో వాల్టర్​ అనే పాత్ర పోషిస్తున్నాడు. 

బాధ్యతగల పౌరుడిగా..

సెలబ్రెటీ క్రికెట్ లీగ్​ ఆడడం, ఫుట్​బాల్​ పోటీలైన ఇండియన్ సూపర్​ లీగ్​లో కేరళ బ్లాస్టర్స్​కి యూత్​ అంబాసిడర్​గా ఉన్నాడు. ఇలా యూత్​లో క్రేజ్​ సంపాదించుకున్న నటుడు అవసరమైనప్పుడు తన వంతు సామాజిక బాధ్యతను కూడా ప్రదర్శించాడు. గతంలో నివిన్ మ్యూజిక్​ వీడియోలు, షార్ట్​ ఫిల్మ్స్​ లోనూ నటించాడు. వాటిలో ఒకటి ‘నో గో టెల్’. అందులో తన సొంత పాత్రలో నటించాడు. ఆ షార్ట్​ ఫిల్మ్ వైరల్ కావడంతో దాన్ని కేరళ స్టేట్​ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్​ ఆఫ్​ చైల్డ్ రైట్స్ పరిశీలించింది. ఆ తర్వాత నుంచి పిల్లల్లో సెక్సువల్ అబ్యూజ్​, బాడీ సేఫ్టీ గురించి అవేర్​నెస్ క్రియేట్ చేయడంపై ఫోకస్​ చేసింది. అంతేకాదు.. 2018లో కేరళలో వచ్చిన వరదల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా నష్టపోయారు. ఆ టైంలో తన సొంతూరు అలువ వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన రిలీఫ్​ క్యాంప్​లను విజిట్ చేశాడు. బాధితులకు నిత్యవసరాలను సమకూర్చడంలో సాయం చేశాడు. అలాగే కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేసిన చీఫ్​ మినిస్టర్స్​ డిస్ట్రెస్​ రిలీఫ్​ ఫండ్​కు డొనేషన్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆన్​ కాల్ క్యాంపెయిన్స్​లో పాల్గొన్నాడు. పేషెంట్లు, హెల్త్ కేర్ వర్కర్స్​తో మాట్లాడాడు. ఆ తర్వాత ప్యాండెమిక్​ టైంలో లాక్​ డౌన్​ అయినప్పుడు స్వతహాగా సర్వీస్​ చేస్తోన్న వాళ్లను ఎంకరేజ్ చేస్తూ థ్యాంకింగ్ లెటర్ పంపాడు. ఇవే కాకుండా కేరళలో విజిలెన్స్​ యాంటీ కరప్షన్ బ్యూరో లాంచ్ చేసిన ‘డ్రగ్ ఫ్రీ కేరళ’ క్యాంపెయిన్​లో భాగమయ్యాడు. 

ఫార్మాతో మెసేజ్​ ఇవ్వాలని..

‘‘ఇప్పటివరకు నేను వెబ్ సిరీస్​ల్లో నటించలేదు. చాలా స్టోరీలు విన్నాను. కానీ ఈ కథ పిల్లలకు కనెక్ట్ అవుతుంది అనిపించింది. చాలా పర్సనల్​గా తీసుకున్నాను. ‘నా పిల్లలకు జరిగితే ఎలా?’ అని ఆలోచించా. ఇది కేవలం సిరీస్​ లేదా ఎంటర్​టైన్​మెంట్ కాదు. దీని వెనక ఒక కారణం ఉంది. అందుకే నేను ఈ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నా. ఈ సిరీస్​లో పాత్రకు సంబంధించి చాలా డీటెయిల్స్ ఉంటాయి. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్​దే. ఎందుకంటే అతను ఇంతకుముందు మెడికల్​ రిప్రజెంటేటివ్​గా పనిచేశాడు. కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది? అనేది అతనికి పూర్తిగా తెలుసు. నిజానికి డైరెక్షన్ చేయాలనుకున్నప్పుడు తన దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి. కానీ, నాకు ఈ కథ చెప్పడానికి కారణం, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని మాత్రమే. ఇక నుంచి ఏదైనా మెడిసిన్ వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పే సిరీస్​ ఇది. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్​పుట్స్​తోపాటు మా అమ్మ కూడా విదేశంలో పనిచేసిన హెడ్ నర్స్​ కావడంతో కాలేజీ డేస్​లోనే నాకు చాలా విషయాలు తెలిసేవి. మెడిసిన్స్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అమ్మ నాతో చెప్తూ ఉండేది. ప్రతి చిన్నదానికి మెడిసిన్ వాడొద్దు అని చెప్పేది. అయితే కొవిడ్ వ్యాక్సిన్ తర్వాత మీడియాలో చాలా పెద్ద డిబేట్ జరిగింది. ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్స్ కూడా బాగా చూస్తున్నారు. ఏదేమయినప్పటికీ మెడిసిన్స్ వాడకంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు. ఆ విషయాన్ని చెప్పడానికే మేం ఈ సిరీస్ తీశాం’’.

షోలే, డీడీఎల్​జె, అర్జున్ రెడ్డి.. నాకు ప్రేమమ్!

కెరీర్​లో ఎన్ని సినిమాలు చేసినా రకరకాల క్యారెక్టర్స్ చేసినా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా ఏదంటే ‘ప్రేమమ్’. 2015లో వచ్చిన ఈ సినిమా క్రేజ్​ చాలాకాలం తనకు గుర్తింపునిచ్చింది. ఇతర భాషల్లో ఉన్న ప్రేక్షకుల ప్రేమను సైతం సొంతం చేసుకున్నాడు. తనకంటూ ఒక యాక్టర్​గా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘‘ఈ ఏడాదితో ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేండ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ ‘ప్రేమమ్’​ సినిమా గురించి ఆడియెన్స్ చెప్తూనే ఉంటారు. ప్రతి నటుడికీ  ‘షోలే, దిల్​వాలే.., అర్జున్ రెడ్డి లాంటి ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రావాలని కోరిక ఉంటుంది. అది నాకు ‘ప్రేమమ్’ ద్వారా వచ్చింది. ఏదో జరిగింది.. ఆ మూవీ కల్ట్​ అయింది. ఏం జరిగిందో తెలియదు కానీ, ప్రతి సినిమాకు అలా జరగాలని కోరుకుంటా. పర్సనల్​ లైఫ్ విషయానికొస్తే.. ఇప్పుడు నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే.. అతిపెద్ద సంపద అంటే డబ్బు కాదు. సంతోషం, ప్రశాంతత. వాటిని మరేవీ ఢీకొట్టలేవు. కాబట్టి మిమ్మల్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉంచే నిర్ణయాలు తీసుకోవాలని చెప్తా’’.