
- ఏడో తరగతి వరకు క్లాసులపై క్లారిటీ కరువు
- పీఎస్, యూపీఎస్ టీచర్లు బడికి రావాలో లేదో చెప్పని ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సోమవారం నుంచి 8, 9, టెన్త్ క్లాసుల స్టూడెంట్లకు టీవీ పాఠాలు మొదలు కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి టీశాట్ విద్యా చానల్ ద్వారా క్లాసులు నిర్వహిస్తామని ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఈనెల 24 నుంచి 28 వరకూ (26న సెలవు) టీవీ పాఠాల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ప్రతిరోజూ ఆయా తరగతులకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియం స్టూడెంట్లకు రెండు పీరియడ్లు ఉంటాయి. ప్రతి పీరియడ్ అరగంట ఉంటుంది. కేవలం టీశాట్ విద్య చానల్ ద్వారా మాత్రమే క్లాసులు తీసుకోవడంపై టీచర్లు, పేరెంట్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. సోమవారం నుంచి టీచర్లు కూడా బడులకు రావాల్సి ఉంది. రొటేషన్ సిస్టమ్లో డైలీ 50% టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అటెండ్ కావాలని ఇటీవల ఉత్తర్వులిచ్చారు. కేవలం హైస్కూల్ టీచర్లు మాత్రమే డ్యూటీలకు రావాలా లేక అందరు టీచర్లు రావాలా అనే దానిపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు స్పష్టత ఇవ్వలేదు.
ఏడో తరగతి వరకు ఎట్ల.?
కరోనాతో ఈనెల 8 నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. 16తోనే ముగియాల్సి ఉండగా, సర్కారు ఈ నెల 30 వరకూ పొడిగించింది. దీంతో ఇంటర్, డిగ్రీ, ఆపై క్లాసులకు ఆన్లైన్ పాఠాలు మొదలు కాగా, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో ఆలస్యంగా సోమవారం (ఈ నెల24) నుంచి టీవీ పాఠాలు మొదలు కాబోతున్నాయి. అది కూడా కేవలం 8,9,10 క్లాసులకే. మరి ఫస్ట్ నుంచి సెవెన్త్ క్లాసు స్టూడెంట్ల పరిస్థితి ఏంటో చెప్పలేదు. ఇప్పటికే విద్యా ప్రమాణాలు తగ్గాయి. కనీసం టీవీ పాఠాలు కూడా చెప్పకపోతే పేద విద్యార్థులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.