ఫ్రూట్స్ తినడంపై నిపుణుల సలహా..!

ఫ్రూట్స్ తినడంపై నిపుణుల సలహా..!

ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది అని అడగ్గానే ఫ్రూట్స్ అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. నిజమే. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో ఉండే పోషకాలు మరెందులోనూ ఉండవు. అందుకే వీలైనన్ని పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఫ్రూట్స్ తీసుకోవడానికి సరైన సమయం అనేది ఒకటి ఉంది. ఆ టైంలో తింటే వాటిలోని పోషకాలన్నీ శరీరానికి సరిగ్గా అందుతాయ్​.

యాపిల్, ద్రాక్ష, జామ‌, కివి, మామిడి, అర‌టి పండు… ఇలా మ‌న‌కు తినేందుకు ర‌కర‌కాల పండ్లు ఉన్నాయ్​. కానీ ఆ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు  తింటే  ఆరోగ్యానికి  మంచిది కాదు.  వాటిని తినేందుకూ  ఓ టైం ఉంటుంది.

ఉదయం

ఉదయం పరగడుపునే పండ్లు తినడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. మామూలుగానే పండ్లు త్వరగా అరిగిపోతాయి.

పరగడుపునే అయితే ఆ అరుగుదల మరింత మెరుగ్గా ఉంటుంది. పైగా అప్పటికి ఎలాంటి తిండి కడుపులోకి వెళ్లకపోవడం వల్ల  పండ్లలోని పోషకాలు శరీరానికి  మంచిగా అందుతాయ్​.  అయితే  గ్యాస్‌, అసిడిటీ, అల్సర్లు  ఉన్నవాళ్లు  ప‌ర‌గ‌డుపున పండ్లు తిన‌కూడదు. ముఖ్యంగా

విట‌మిన్– సి ఎక్కువ‌గా ఉండే నిమ్మజాతి పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కారణంగా గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దాంతో పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అంటున్నారు డాక్టర్లు.

భోజనానికి మధ్య

భోజనానికి ఒక గంట ముందు, రెండు గంటల తర్వాత  పండ్లు తీసుకోవచ్చు. దీనివల్ల విటమిన్‌‌– సి, ఫైబర్లు పూర్తిగా శరీరంలోకి చేరుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.  భోజనం చేసిన వెంటనే మాత్రం పండ్లు తినొద్దు.

రాత్రి పూట

రాత్రి పడుకునే ముందు  ఫ్రూట్స్ తినడం మంచిది కాదు. అలా తింటే శరీరంలో షుగర్​ లెవెల్స్​ పెరుగుతాయి. నిద్రకు ఆటంకం.  అందుకని నిద్రపోయే గంట ముందు యాపిల్‌, అర‌టి, కివి, చెర్రీ పండ్లు తినొచ్చు. వీటిల్లో  సెర‌టోనిన్‌, మెల‌టోనిన్‌, ట్రిప్టోఫాన్ ఎక్కువ‌గా ఉంటాయి. అవి మంచి నిద్రను అందించ‌డ‌మే కాదు ఆందోళ‌న‌ను, ఒత్తిడిని కూడా  దూరం చేస్తాయి. దీంతో ఉద‌యం నిద్ర లేవడంతోనే తాజాగా ఉంటారు. రాత్రి పూట మామిడి పండ్లు, ద్రాక్ష వంటివి తింటే సరిగ్గా నిద్ర పట్టదు.