అప్పుడే ఎండలు మొదలయ్యాయి. బయటికెళ్తే ఒంట్లో నీరంతా ఆవిరైపోతోంది. ఈ వేసవి తాపం తట్టుకోవాలంటే కేవలం పండ్లు, జ్యూస్లు సరిపోవు. ఏది తిన్నా ఒంటికి చలువ చేసేలా ఎంచుకోవాలి. కాబట్టి ముల్లంగితో మొదలుపెట్టేయండి. ఇక్కడున్న రెసిపీలు తెలుసుకున్నారంటే.. ఎప్పుడూ ముల్లంగిని ముట్టుకోనివాళ్లు కూడా ముచ్చటపడి తెచ్చుకుంటారు. మరింకేం.. వేసవి రాకకు సిద్ధమైపోండి.
కట్లెట్
కావాల్సినవి :
- ముల్లంగి - రెండు
- వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
- పచ్చిమిర్చి - మూడు
- కొత్తిమీర - అర కప్పు
- ఉప్పు, నూనె - సరిపడా
- కారం, మిరియాల పొడి -
- ఒక్కోటి అర టీస్పూన్
- గోధుమపిండి - నాలుగు టేబుల్ స్పూన్లు
తయారీ :
ముల్లంగిని శుభ్రంగా కడిగి, తొక్క తీశాక తురమాలి. ఒక గిన్నెలో ముల్లంగి తురుము, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తర్వాత గోధుమపిండి వేసి మరోసారి బాగా కలిపి ముద్దగా చేయాలి. కొంచెం పిండిని తీసుకుని ఉండగా చేసి అరచేతిలో గారెలా వత్తాలి. పాన్లో నూనె వేడి చేసి రెడీ చేసుకున్న కట్లెట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు రెండు వైపులా కాల్చాలి.
పచ్చడి
తయారీ :
ముల్లంగిని తొక్క తీసి చిన్నముక్కలుగా కట్ చేయాలి. పాన్లో నూనె వేడి చేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు వేసి వేగించాలి. పచ్చిమిర్చి, ముల్లంగి ముక్కలు, నువ్వులు వేసి వేగించాలి. అవన్నీ వేగాక టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, చింతపండు వేసి బాగా కలపాలి. తర్వాత మూతపెట్టి కాసేపు ఉడికించాలి. అందులో నీరంతా ఇంకిపోయాక చల్లారనివ్వాలి. ఆపై రోట్లో వేసి దంచినా, మిక్సీలో వేసి గ్రైండ్ చేసినా.. తాలింపు వేసుకుంటే సరి.
కావాల్సినవి :
- ముల్లంగి - ఒకటి
- టొమాటోలు - మూడు
- పచ్చిమిర్చి - పదిహేను
- ఉప్పు, నూనె - సరిపడా
- మెంతులు - చిటికెడు
- ఆవాలు, జీలకర్ర -
- ఒక్కో టీస్పూన్
- ధనియాలు, శనగపప్పు -
- ఒక్కోటి రెండు టీస్పూన్లు
- నువ్వులు -
- రెండు టేబుల్ స్పూన్లు
- చింతపండు - కొంచెం
- పసుపు - అర టీస్పూన్
రోటీ
కావాల్సినవి :
- ముల్లంగి తురుము - రెండు కప్పులు
- క్యారెట్ తురుము - ఒక కప్పు
- ఉల్లిగడ్డ తరుగు, జొన్నపిండి, రాగిపిండి -
- ఒక్కోటి అర కప్పు
- పచ్చిమిర్చి తరుగు - ఒక టీస్పూన్
- కొత్తిమీర - కొంచెం
- పసుపు - పావు టీస్పూన్
- ఉప్పు, నూనె - సరిపడా
- శనగపిండి - పావు కప్పు
- కారం, జీలకర్ర పొడి, గరం మసాలా -
- ఒక్కోటి అర టీస్పూన్
- నువ్వులు, కసూరి మేథీ -
- ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
తయారీ :
ఒక గిన్నెలో ముల్లంగి, క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, పసుపు, కారం, జీలకర్రపొడి, గరం మసాలా, నువ్వులు, కసూరి మేథీ, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత జొన్నపిండి, రాగిపిండి, శనగపిండి అవన్నీ కలిపి ముద్దగా చేయాలి. చిన్న ఉండ తీసుకుని వేడి పాన్ మీద పెట్టి రోటీలా చేతితో అదమాలి. దాని చుట్టూ నూనె వేసి మూతపెట్టాలి. తర్వాత రోటీని తిప్పేయాలి. అలా రెండు వైపులా కాల్చాలి.
►ALSO READ | గోట్‌తో.. హెల్దీ లైఫ్! తనపై తానే ప్రయోగం చేసుకుని.. పెద్ద కంపెనీనే పెట్టేశాడు
