చాలామంది ఉదయం నిద్ర లేవగానే.. రెడీ అయ్యి ఆఫీసుకు పరుగులు పెడుతుంటారు. ఈ బిజీ లైఫ్స్టయిల్లో బ్రేక్‌ఫాస్ట్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వీలైతే తక్కువ టైంలో చేసుకోగలిగేవి తింటున్నారు. లేదంటే స్కిప్ చేస్తున్నారు. ఇలాంటి అలవాట్లను మార్చాలనే లక్ష్యంతోనే 26 ఏళ్ల కుర్రాడు యష్ ‘గోట్ లైఫ్’ పేరు తో ఒక స్టార్టప్ పెట్టాడు. దీని ద్వారా హై ప్రోటీన్, జీరో రిఫైండ్ షుగర్ ఓట్‌మీల్ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చాడు. తక్కువ ధరలో దొరికే ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ని కేవలం 30 సెకన్లలో రెడీ చేసుకోవచ్చు.
యష్ కల్రా రాజస్థాన్‌లోని కోటాలో పుట్టి, పెరిగాడు. పై చదువుల కోసం ముంబైకి వెళ్లాడు. అక్కడే బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తి చేశాడు. చదువుకుంటున్న టైంలోనే దేశంలో కరోనా వచ్చింది. లాక్‌డౌన్ విధించడంతో ముంబై నుంచి సొంతూరికి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నన్ని రోజులు లడ్డూలు, మిఠాయిలు, నెయ్యితో చేసిన పరాటాలు లాంటివి బాగా తిన్నాడు. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా వాటినే తినేవాడు.
దాంతో విపరీతంగా బరువు పెరిగాడు. కానీ.. కొన్నాళ్లకు తన తప్పు తెలుసుకుని ఫుడ్ అలవాట్లను మార్చుకున్నాడు. దాంతో 20 కిలోలు తగ్గాడు. అతనే కాదు.. వాళ్ల ఫ్యామిలీలో అందరికీ అవగాహన కల్పించి బరువు తగ్గేలా చేశాడు. ఈ జర్నీలో అతనికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ ఖరీదైనదని, వండడం కష్టమని అర్థమైంది. పైగా అలాంటి ఫుడ్స్ రోజూ తింటే చాలా బోరింగ్‌గా అనిపిస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ఈజీగా రెడీ చేసుకోగలిగే ప్రొటీన్ ఫుడ్ స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
మొదటి ప్రయోగం విఫలం
ప్రొటీన్ ఫుడ్ స్టార్టప్ ఆలోచన వచ్చిన వెంటనే 21 ఏండ్ల వయసులో యష్ మొదటగా ‘వైజ్ ఎగ్’ని స్థాపించాడు. దీనిద్వారా ఎగ్ వైట్స్‌తో తయారుచేసిన ప్రొటీన్ డ్రింక్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. కానీ, షెల్ఫ్ లైఫ్ సమస్యల వల్ల అది విఫలమైంది. తన దగ్గరున్న డబ్బు కూడా అయిపోయింది. అయినా యష్ పట్టు వదలకుండా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ పాఠాలు నేర్చుకుని మరో స్టార్టప్ పెట్టేందుకు ప్లాన్ చేశాడు.
►ALSO READ | ఆధ్యాత్మికం: ఉసిరి చెట్టు కింద ఆవనూనెతో దీపారాధన.. ఆస్తి,ఐశ్వర్యం రెట్టింపు.. జాతకంలో దోషాలు మటాష్
ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చాలా రీసెర్చ్ చేశాడు. చివరకు ఓట్స్‌తో హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ తయారుచేయాలనే ఐడియా వచ్చింది. 50కి పైగా రెసిపీలు టెస్ట్ చేశాడు. 2,100 గిన్నెల ఓట్ మీల్స్‌ను స్వయంగా తిన్నాడు. అలా చివరకు పర్ఫెక్ట్ ప్రొడక్ట్ సృష్టించాడు. దానిని 2023 జులైలో ‘గోట్’(GOAT)పేరుతో మార్కెట్‌లో అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడదే గోట్ లైఫ్‌గా మారింది.
కష్టాలు తప్పలేదు
గోట్ కూడా పెట్టిన వెంటనే సక్సెస్ కాలేదు. మొదటి సంవత్సరంలో రోజుకు కేవలం 50 ప్యాక్‌లు మాత్రమే అమ్ముడుపోయాయి. దాంతో 100కు పైగా పాప్-అప్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైళ్లలో అమ్మారు. ఇంటింటికీ తిరుగుతూ శాంపిల్ ప్యాక్‌లు ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేశారు. కోటా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఆఫ్‌లైన్ ఈవెంట్స్ ఏర్పాటు చేసి 2 వేల మందితో ప్రొడక్ట్‌ని ట్రై చేయించారు. కొన్నాళ్లకు సేల్స్ పెరిగాయి. బ్రాండ్ స్ట్రీట్ మార్కెట్ నుంచి షార్క్ ట్యాంక్‌లో లక్షల మందిని ఆకట్టుకునే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు గోట్ లైఫ్ ప్రతిరోజూ 10 వేల కంటే ఎక్కువ ప్యాక్‌లను అమ్ముతోంది. రూ.5 లక్షల సేవింగ్స్, లోన్‌తో స్టార్ట్ చేసిన ఈ స్టార్టప్ కంపెనీకి ఇప్పుడు ఏడాదికి సుమారు రూ. 25 కోట్ల ఆదాయం వస్తోంది.
ఎలా తయారుచేస్తారంటే..
హై క్వాలిటీ ఓట్స్‌లో వే ప్రొటీన్, డేట్ పౌడర్, బెల్లం పొడి, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివాటిని సరైన మోతాదులో కలిసి ఇన్‌స్టంట్ ఓట్ మీల్‌ని తయారుచేస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చక్కెర అస్సలు ఉండదు. దీన్ని 30 సెకన్లలో రెడీ చేసుకోవచ్చు. వీటిలో ఎలాంటి సింథటిక్ ప్రిజర్వేటివ్స్ వాడరు. ఆల్మండ్ కుల్ఫీ, చాకో నట్ క్రంచ్, మ్యాంగో మ్యాడ్‌నెస్, మోచ మార్వెల్.. ఇలా రకరకాల పేర్లతో అనేక ఫ్లేవర్స్‌ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఓట్స్‌తో చేసిన కుకీస్‌ని కూడా అమ్ముతున్నారు.
ప్రొటీన్ తక్కువే
‘‘లక్షలాదిమంది భారతీయులు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తింటున్నామనేది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉదయం పూట మన శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం. కానీ.. చాలామంది ప్రొటీన్ ఫుడ్‌కి బదులుగా ఎక్కువశాతం కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్ తింటున్నారు. అది ఆరోగ్యకరమైన అలవాటు కాదు. అందుకే దాదాపు 73శాతం మంది ఇండియన్స్ ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నారు. అందరికీ సరైన ప్రొటీన్ అందించాలనే ఉద్దేశంతోనే నేను ‘గోట్ లైఫ్’ మొదలుపెట్టా” అంటూ చెప్పుకొచ్చాడు యష్.
