బెంగళూరు: గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ (81 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 బ్యాటింగ్) ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. సౌతాఫ్రికా–ఎతో జరుగుతున్న తొలి అనధికార టెస్ట్‌లో ఇండియా–ఎ తరఫున హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో సఫారీ జట్టు నిర్దేశించిన 275 రన్స్ లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా–ఎ మూడో రోజు శనివారం ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 119/4 స్కోరు చేసింది.
సాయి సుదర్శన్ (12), ఆయుష్ మాత్రే (6), దేవదత్ పడ్కిల్ (5) ఫెయిల్ కావడంతో ఇండియా 32/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో రజత్ పటీదార్ (28)తో కలిసి పంత్ నాలుగో వికెట్‌కు 87 రన్స్ జత చేశాడు. షెపో మోరెకి 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 30/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 48.1 ఓవర్లలో 199 రన్స్‌కే ఆలౌటైంది. సెనోక్వానే (37), జుబైర్ హమ్జా (37), షెపో మోరెకి (25) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. కొటియాన్ 4, అన్షుల్ కాంబోజ్ 3, గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు పడగొట్టారు. ఓవరాల్‌గా ఇండియా గెలవడానికి మరో156 రన్స్ అవసరం కాగా, చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.
