ఏదైనా మిర్చీ బండి దగ్గరికెళ్లీ ప్లేట్ మిర్చీ పార్సిల్ అంటే ఏం చేస్తారు.. వెంటనే న్యూస్ పేపర్ చించి ఓ పొట్లం కట్టి ఇచ్చేస్తారు. ఇదొక్కటే కాదు.. సమోసా, పూరీ, దోశ.. ఇలా స్నాక్స్ అయినా.. టిఫిన్స్ అయినా అన్నింటికీ ప్యాకింగ్ వస్తువు న్యూస్ పేపరే కదా. న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన ఫుడ్ తింటే ప్రాణాలకే ప్రమాదమని ఇప్పటి వరకు చాలా మందికి తిలిసి ఉండకపోవచ్చు. తెలిసినా ఏం చేస్తాంలే అని లైట్ తీసుకోవచ్చు.
కానీ ఇక నుంచి ఫుడ్ ప్యాకింగ్ కోసం న్యూస్ పేపర్లు వాడితే ఇక మీరు కేసుల్లో ఇరుక్కోక తప్పదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) న్యూస్ పేపర్ల వాడకంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రింటింగ్ అయిన పేపర్లను వాడితే ఆరోగ్యానికి తీవ్ర హానికర ప్రమాదం ఉన్నందున న్యూస్ పేపర్ తో ప్యాకింగ్ చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది.
ముంబైలో వడా పావ్ వ్యాపారీ అటు పార్సిల్ కు, ఇటు తినే వారికి న్యూస్ పేపర్ వినియోగించడతో.. జనాలకు ఉన్న హెల్త్ రిస్క్ ను దృష్టిలో ఉంచుకుని న్యూస్ పేపర్ వినియోగాన్ని బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఫుడ్ సేఫ్టీ సంస్థ.
►ALSO READ | ఇవేం గంజాయి తెలివితేటల్రా బాబూ.. కానీ.. కుక్కర్ విజిల్ పట్టించేసింది !
కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సంయుక్తంగా వివిధ హోటల్స్, దుకాణాలలో తనిఖీలు చేశారు. స్ట్రీట్ ఫుడ్ వినియోగంలో ఎక్కువగా న్యూస్ పేపర్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వివిధ వ్యాపారులకు నోటీసులు అందించారు.
వీధి వ్యాపారులే కాకుండా రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్స్, క్యాటరింగ్, క్యూఎస్ఆర్, మొబైల్ ఫుడ్ మొదలైన ప్రతీ చోట న్యూస్ పేపర్ వాడుతున్నట్లు గుర్తించారు.
న్యూస్ పేపర్ లో వాడే ఇంకులో లెడ్ తో పాటు ఇతర హానికరమైన మూలకాలు ఉంటాయని.. ఇవి శరీరంలోకి వెళ్తే దీర్ఘకాలికంగా వ్యాధులు, కొన్ని సార్లు క్యాన్సర్ కూడా రావచ్చని హెచ్చరించారు. ఆహార పదార్థాల అమ్మకానికి న్యూస్ పేపర్ వినియోగాన్ని 2018లోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు హెచ్చరించారు. ముంబై తో పాటు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలలో కూడా న్యూస్ పేపర్ వినియోగాన్ని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వాలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆలోచిస్తున్నారు.
