మార్కెట్లో ప్లాస్టిక్ ఎగ్స్ అమ్ముతున్నారా? ఫేక్ కోడిగుడ్లను ఎలా కనిపెట్టాలో చెప్పిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్

మార్కెట్లో ప్లాస్టిక్ ఎగ్స్ అమ్ముతున్నారా? ఫేక్ కోడిగుడ్లను ఎలా కనిపెట్టాలో చెప్పిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్

సాధారణంగా మనం మార్కెట్ నుంచి తెచ్చిన కోడిగుడ్డును పగులగొట్టినప్పుడు.. అది అసలైనదా లేక సోషల్ మీడియాలో ప్రచారం జరగుతున్నట్లు "ప్లాస్టిక్ గుడ్డు" లాంటిదా అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంటుంది. అయితే ఇలాంటి వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను చూసి మోసపోవద్దని ఫుడ్ సేఫ్డీ డిపార్ట్మెంట్ FSSAI ప్రజలను హెచ్చరించింది. ఎక్స్ అకౌంట్లో దీనికి సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ.. కోడిగుడ్డు ఫ్రెష్‌దో కాదో ఇంట్లోనే ఈజీగా టెస్ట్ చేసే విధానాన్ని వివరించింది.

ఇంట్లోనే కోడిగుడ్డు పరీక్షించే విధానం:
కోడిగుడ్డు తాజాదనాన్ని నిర్ధారించుకోవడానికి "నీటి పరీక్ష" సులువైన పద్ధతి. దీనికోసం ఒక గిన్నెలో నీరు తీసుకుని.. అందులో కోడిగుడ్డును మెల్లగా ఉంచాలి. తాజా కోడిగుడ్డు అయితే నీటిలో మునిగి అడుగుకు చేరుకుంటుంది. ఒక కోడిగుడ్డు పాతబడే కొద్దీ.. దాని పెంకులో ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా తేమ క్రమంగా ఆవిరైపోతుంది. దీనివల్ల లోపల గాలి పరిమాణం పెరిగి, గుడ్డు నీటిలో నిటారుగా నిలబడటం లేదా తేలడం జరుగుతుంది. కాబట్టి కాలక్రమేణా గుడ్డులో వచ్చే ఈ సహజ మార్పులను బట్టి అది చెడిపోయిందా లేదా అని అంచనా వేయవచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.

అవి ఫేక్ ఎగ్స్ కాదు.. 
ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న మరో అపోహపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టతనిచ్చారు. కోడిగుడ్డు పగులగొట్టినప్పుడు పచ్చసొన, తెల్లసొన కలిసిపోతే అది ప్లాస్టిక్ గుడ్డు అని కొందరు అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ గుడ్డు పాతదయ్యే కొద్దీ దానిలోని సొన, తెల్లసొన విడిపోయే గుణాన్ని కోల్పోయి కలిసిపోతాయట. కేవలం సొన కలిసిపోయినంత మాత్రాన అది ప్లాస్టిక్ గుడ్డు కాదని, ఇది పాతబడటం వల్ల జరిగే సాధారణ ప్రక్రియేనని అధికారులు స్పష్టం చేశారు.

గుడ్డు పెంకు ఎందుకు పొడిగా మారుతుంది?
కోడిగుడ్ల పెంకులు సహజంగానే అత్యంత సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉంటాయి. దీనివల్ల గుడ్డులోని తేమ, గాలి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. గుడ్డు వయస్సు పెరిగే కొద్దీ తేమ కోల్పోవడం వల్ల దాని పెంకు పొడిగా మారుతుంది. అలాగే లోపల ఉండే ఖాళీ ప్రదేశం పెరగడం వల్ల గుడ్డు బరువు, దాని ప్రవర్తనలో స్వల్ప మార్పులు వస్తాయి. ఇవన్నీ సహజమైన పరిణామాలే తప్ప.. ప్లాస్టిక్‌తో తయారయ్యే గుడ్లకు ఎలాంటి సంబంధం లేదు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల సలహా:
మార్కెట్లో దొరికే కోడిగుడ్లపై వస్తున్న ప్లాస్టిక్ వదంతులను నమ్మవద్దని FSSAI కోరింది. వినియోగదారులు ఆహారానికి సంబంధించిన విషయాలలో సోషల్ మీడియా వదంతులపై ఆధారపడకుండా.. ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది. కేవలం నీటి పరీక్షతో పాటు, గుడ్డును వంటకు ఉపయోగించే ముందు ఏదైనా దుర్వాసన వస్తోందా, పెంకుకు పగుళ్లు ఉన్నాయా వంటి ఇతర చెడిపోయిన లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం బెటర్ అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.