పెట్రోల్ కొరతపై పుకార్లు.. బంకుల వద్ద భారీ క్యూలైన్లు

పెట్రోల్ కొరతపై పుకార్లు.. బంకుల వద్ద భారీ క్యూలైన్లు
  • హైదరాబాద్ ​సహా అనేక చోట్ల అర్ధరాత్రి నుంచే బారులు
  • ఫుల్​ ట్యాంకు చేయించుకున్న జనం 
  • డ్రమ్ములు, క్యాన్లలో నింపాలని గొడవ
  • గ్రేటర్​ హైదరాబాద్​లో కిలోమీటర్ల మేర వాహనాల క్యూ
  • యుద్ధం భయంతో పెట్రోల్ కోసం జనం పరుగులు
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌లో ‘లాక్‌‌‌‌‌‌‌‌డౌన్’ వార్తలు
  • నిల్వలు ఉన్నాయని.. ఆందోళన వద్దని అధికారుల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో పెట్రోల్​ ప్యానిక్ మొదలైంది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కట్టారు. 

ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల ఎదుట వాహనాల క్యూలైన్లు కనిపించాయి. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్​ బంకులు కిక్కిరిశాయి. బుధవారం ఉదయం నుంచీ వాహనదారులు బంకుల వద్దకు చేరుకుని గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారుజాము నుంచే వాహనదారులు బారులు తీరి ఫుల్ ట్యాంకు చేయించుకోవడంతో సాధారణ విక్రయాల కంటే మూడు రెట్లు అధికంగా అమ్మకాలు నమోదయ్యాయి. 

కొన్ని బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంతో ఆందోళన మరింత పెరిగింది. ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలనే ఆత్రుతతో జనం బంకులపై పోటెత్తడంతో పలు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. కూకట్‌‌‌‌పల్లి, అమీర్‌‌‌‌పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సనత్‌‌‌‌నగర్, ఎర్రగడ్డ, అబిడ్స్, మియాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూలు కట్టారు. కార్లు, ఆటోలు, బైకులు, కంటైనర్లు గంటల తరబడి రోడ్డుపై నిలిచిపోయాయి. 

ఫుల్​ట్యాంకు చేయించుకున్న జనం.. బంకుల వద్ద హడావిడి

సాధారణంగా కొద్దిగా పెట్రోల్, డీజిల్​మాత్రమే కొనుగోలు చేసే వాహనదారులు కూడా ఈసారి ‘ఫుల్ ట్యాంక్’ కోసం పోటీ పడ్డారు. కొందరు డ్రమ్ములు, క్యాన్లతో వచ్చి పెట్రోల్ నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడంతో బంకుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని బంకులు తాత్కాలికంగా అమ్మకాలను పరిమితం చేయాల్సి వచ్చింది. రోజువారీ సాధారణంగా వంద-, రెండు వందల పెట్రోల్​ పోయించుకునే వారు ఈసారి ట్యాంకు ఫుల్ చేయించుకోవడంతో పాటు డ్రమ్ములు, క్యాన్లు, వాటర్ బాటిల్స్‌‌‌‌లో కూడా నింపాలని గొడవకు దిగారు.

 మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  హైదరాబాద్‌‌‌‌తో పాటు ఆదిలాబాద్, మహబూబ్‌‌‌‌నగర్, జగిత్యాల, నల్గొండ వంటి జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు బంకుల వద్ద పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ జరుగుతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు.

‘నో స్టాక్’ బోర్డులతో ఆందోళన

“రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. హెచ్‌‌‌‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. సరఫరా వ్యవస్థ సాధారణంగానే ఉంది” అని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అధిక రద్దీ కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నిల్వలు త్వరగా ఖాళీ కావడంతో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. అయితే, ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డిపోల నుంచి ట్యాంకర్లు చేరుకునే వరకు మాత్రమే ఈ అంతరాయం ఉంటుందని తెలిపారు. 

యుద్ధ భయాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతుల వల్లే జనం ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకుని ఫుల్ ట్యాంకు చేయించుకోవడంతో తాత్కాలికంగా నిల్వలు అయిపోతున్నాయని వివరించారు. డిపోల నుంచి ట్యాంకర్లు వచ్చి నింపడానికి కొంత సమయం పడుతుందని, ఆ గ్యాప్‌‌‌‌లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపింది. “ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు సరఫరా యంత్రాంగం పూర్తిగా సక్రమంగా పనిచేస్తోంది. అన్ని జిల్లాల్లో రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. తప్పుడు వార్తలు, వదంతుల వల్లే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడింది” అని సివిల్​ సప్లయ్స్ శాఖ  ప్రకటన విడుదల చేసింది.

 పెట్రోల్, డీజీల్​ విక్రయాలు మూడు రెట్లు..  

పెట్రోల్​ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం సాధారణ రోజులతో పోలిస్తే బుధవారం రోజు విక్రయాలు 2.5 నుంచి 3 రెట్లు పెరిగాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడం వల్లే బంకుల వద్ద రద్దీ అధికమైందని “అవసరం లేకున్నా అందరూ ట్యాంకు ఫుల్ చేయించుకోవడం, డ్రమ్ములు, క్యాన్లలో నింపుకోవడం వల్లే ఈ పరిస్థితి” అని బంకు యజమానులు  చెబుతున్నారు.

 మళ్లీ ‘లాక్‌‌‌‌ డౌన్’ భయం  

సోషల్ మీడియాలో ‘లాక్‌‌‌‌డౌన్’ అనే పదం మళ్లీ ట్రెండింగ్‌‌‌‌లోకి వచ్చింది. లాక్‌‌‌‌డౌన్’ మళ్లీ వస్తుందనే ప్రచారం కూడా ఈ హడావుడికి కారణమైంది. అయితే, ప్రభుత్వం అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేసింది. 2020 మార్చి 24న కరోనా లాక్‌‌‌‌డౌన్ విధించిన రోజును గుర్తు చేసుకుంటూ యుద్ధం వల్ల మళ్లీ లాక్‌‌‌‌డౌన్ వస్తుందా అనే భయంతో ప్రజలు నిత్యావసరాలు, పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం అటువంటి ఆలోచన లేదని, కేవలం చమురు, గ్యాస్ వంటి సహజ వనరులను పొదుపుగా వాడాలని సూచిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.