- వార్ ఎఫెక్ట్ తో కంపెనీలు పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నులు తగ్గించని ప్రభుత్వాలు
- కేంద్రానికి రూ.3, రాష్ట్ర ఖజానాకు 39 పైసలు లాభం
- పెంచిన ధరలతో కేంద్రానికి ఏటా రూ.38 వేల కోట్లు, రాష్ట్రానికి రూ.350 కోట్లు అదనపు రాబడి
- మొత్తంగా జనం జేబుకు లీటరుపై రూ.3.39 చిల్లు
హైదరాబాద్, వెలుగు: ఇరాన్, అమెరికా యుద్ధం పేరిట దేశీయ చమురు సంస్థలు పెట్రో ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచాయి. శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చిన పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.3 పెంపు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.110.89కి, డీజిల్ రూ.98.96కు చేరడంతో వాహనదారులు బంకులకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
అయితే, ఈ ధరల మంట సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంటే.. ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నది. పెంపు భారం వంద శాతం వినియోగదారుడిపైనే పడుతుండగా, ప్రభుత్వాలకు మాత్రం ఇది ఆదాయ వనరుగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది సామాన్యుడే.. లాభపడేది మాత్రం చమురు సంస్థలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
రాష్ట్రానికి ‘వ్యాట్’ లాభం.. పైసా పెంచకుండానే కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే, రాష్ట్రంలో పెట్రోల్‌పై భారీగా 35.20 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్-) విధిస్తున్నారు. రాష్ట్ర వ్యాట్ అనేది కేవలం బేస్ ధరపైనే కాదు.. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమీషన్ కలిపిన మొత్తంపై లెక్కిస్తారు. తాజాగా రూ.3 పెంచడంతో.. పన్ను లెక్కించే బేస్ మొత్తం పెరిగింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను శాతాన్ని పెంచకపోయినప్పటికీ, పెరిగిన మొత్తంపై 35.20% లెక్కించడం వల్ల లీటరుపై రాష్ట్ర ఖజానాకు ఆటోమేటిక్‌గా 39 పైసల అదనపు ఆదాయం వచ్చి చేరుతోంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు నెలకి సుమారు రూ.28 కోట్లు, ఏడాదికి ఏకంగా రూ.350 కోట్ల మేర అదనపు లాభం రానుంది.
కేంద్రం ‘సెస్సుల’ వేట.. ‘ఫిక్స్‌డ్’ రాబడి
కేంద్ర ప్రభుత్వానికి ఈ పెంపుతో డబుల్ ధమాకా తగిలింది. ఎక్సైజ్ డ్యూటీ పర్సెంటేజీల్లో కాకుండా లీటరుకు ఇంత అని ‘ఫిక్స్‌డ్’ (రూపాయల్లో)గా ఉంటుంది. అంతర్జాతీయంగా రేట్లు మారినా కేంద్రానికి వచ్చే ఈ ఫిక్స్‌డ్ పన్నుకు ఎలాంటి ఢోకా ఉండదు. పైగా, కేంద్రం రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన బేసిక్ డ్యూటీని తగ్గించి, మొత్తం ఆదాయాన్ని ‘రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్’, ‘అగ్రి సెస్’ రూపంలో వసూలు చేస్తోంది.
ఈ సెస్సుల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు రేటు రూ.3 పెంచడంతో కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థల (ఐఓసీఎల్, బీపీసీఎల్) టర్నోవర్, లాభాలు వేల కోట్ల రూపాయలు పెరుగుతాయి. తద్వారా కేంద్రానికి వచ్చే కార్పొరేట్ పన్నులు, డివిడెండ్లు కూడా అమాంతం పెరుగుతాయి. దేశవ్యాప్త వినియోగం ప్రకారం ఈ రూ.3 పెంపుతో కేంద్రానికి నెలకి రూ.3,150 కోట్లు చొప్పున ఏడాదికి రూ.38,325 కోట్ల అదనపు సొమ్ము రానుంది.
ముడిచమురు ధర తగ్గినా.. రేట్లు పెంచారు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్ల నుంచి 80 డాలర్ల మధ్య అదుపులోనే ఉంది. ఈ లెక్కన మన రూపాయల్లోకి మార్చి, రిఫైనరీ ఖర్చులు, రవాణా, డీలర్ కమిషన్లు అన్నీ కలిపినా లీటరు పెట్రోల్ అసలు ధర రూ.55 కంటే ఎక్కువ అవ్వదు. అసలు ధర రూ.55 అయితే, పన్నులు వేయకముందే చమురు సంస్థలు బేస్ ధరను రూ.82.51కి పెంచి ఉంచాయి. అంటే పన్నులు కలపకముందే లీటరుపై సుమారు రూ.27 లాభం (మార్జిన్) కంపెనీల చేతిలో ఉంది. గతంలో ముడిచమురు ధర 100 డాలర్లు దాటినప్పుడు వచ్చిన నష్టాలను ఎప్పుడో పూడ్చుకున్న కంపెనీలు, ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు అనుకూలంగా ఉన్నా సరే, ఆ లాభాన్ని సామాన్యుడికి బదిలీ చేయకుండా విపరీతమైన లాభాలు గడిస్తున్నాయి.
జనానికి ధరల భారం
ఇంధన ధరల పెంపుతో అంతిమంగా వినియోగదారుడిపై లీటరుకు రూ.3.39 ప్రత్యక్ష భారం పడింది. అయితే ఈ భారం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా రవాణా ఖర్చులు తక్షణమే 2.5 నుంచి 3 శాతం పెరిగాయి. ఫలితంగా పల్లెల నుంచి నగరాలకు వచ్చే పాలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి.
సొంత వాహనం లేని పేదవాడు సైతం మార్కెట్లో పెరిగే ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుని నలిగిపోతున్నాడు. ప్రభుత్వాల ఆదాయ గ్రాఫ్‌లు పైపైకి దూసుకెళ్తుంటే, సగటు జీవి బతుకు మాత్రం భారంగా మారుతున్నది.
