మన హైదరాబాద్‎లోనే కాదు.. మిగతా రాష్ట్రాల్లోనూ పెట్రోల్ కొరత.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు..!

మన హైదరాబాద్‎లోనే కాదు.. మిగతా రాష్ట్రాల్లోనూ పెట్రోల్ కొరత.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు..!

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుందనే సోషల్ మీడియా వదంతులతో దేశవ్యాప్తంగా వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. ఇంధనం దొరకదనే పుకార్లకు భయపడి వాహనదారులు పెట్రోల్ బంకులకు పొటెత్తారు. వాహనాదారులు ఒక్కసారిగా తరలిరావడంతో బంకులు కిక్కిరిసిపోయాయి. ముంబై, బెంగళూర్, అహ్మదాబాద్, ఇండోర్, కోల్‎కతా, హైదరాబాద్ వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ బంకుల దగ్గర ఇదే పరిస్థితి. 

వాహనాలు కిలో మీటర్ల మేర క్యూ కట్టాయి. కొన్ని బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తు్న్నాయి. ఇంధన కొరత వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు అవసరం లేకున్నా ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో బంకుల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఓల్డ్ సిటీ, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లలో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. 

కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట వంటి ప్రాంతాలలో వాహనదారులు ఒక్కసారే పొటెత్తడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ సమస్య ఒక్క హైదరాబాద్‎లోనే కాకుండా మహారాష్ట్రలోని సోలాపూర్‌, గుజరాత్‎లోని అహ్మదాబాద్, మెహసానా, మధ్యప్రదేశ్‎లోని ఇండోర్, ఉజ్జయిని, దేవాస్, రత్లాం మరియు షాజాపూర్‌, రాజస్థాన్‌లోని బికనీర్‌, ఉత్తరప్రదేశ్‎లోని ఆగ్రా, కర్నాటక రాజధాని బెంగళూర్, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా బంకుల దగ్గరే ఇదే పరిస్థితి. 

ఇంధనం కోసం వాహనదారులు ఎగబడ్డారు. దీంతో బంకుల దగ్గర కిలో మీటర్ల మేర క్యూ నెలకొంది. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వాస్తవానికి దేశంలో ఇంధన కొరత లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చాయి. కానీ సోషల్ మీడియా వదంతులతో వాహనదారులు బంకులకు పరుగులు తీయడంతో ఈ గందరగోళం ఏర్పడింది.

వాహనదారులు అవసరం లేకున్నా ట్యాంక్ ఫుల్  చేయించుకుంటున్నారు. ప్యానిక్ బయ్యింగ్ పెరగడంతో బంకుల్లో నిల్వలు ఖాళీ అవుతున్నాయి. మంగళ, బుధ వారాల్లో పెట్రోల్ పంపుల దగ్గర సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువ రద్దీ కనిపించింది. ఈ నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు స్పందించింది. దేశంలో ఇంధన కొరత లేదని వివరణ ఇచ్చాయి.  HPCL, IOCL, BPCL  పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిలువలు ఉన్నాయని తెలిపాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని, అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.