
టోక్యో: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్న జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ కార్పొరేషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెలలోనే క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేయాలని ఫుజిఫిల్మ్ భావించినప్పటికీ ఆ ప్రాసెస్ ఆలస్యమవుతోంది. ఈ మేరకు తమ పరిశోధనకు మరికొంత టైమ్ పట్టొచ్చని సదరు సంస్థ ఆదివారం తెలిపింది. జులై వరకు క్లినికల్ ట్రయల్స్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని అని ఫుజిఫిల్మ్ అధికార ప్రతినిధి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని సదరు ప్రతినిధి చెప్పారు.
మే చివర లోపు క్లినికల్ ట్రయల్స్‌ను కంప్లీట్ చేయాల్సిందిగా ప్రధాని షింజో అబే ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. కానీ టెస్టింగ్స్‌కు సరిపడా పేషెంట్స్ లేకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. పరిశోధనలకు అవసరమైన 70 శాతం మంది మాత్రమే ఉన్నారని సమాచారం. ఈ టెస్టుల ఫలితాలు రావడానికి 28 రోజులు పడుతుంది. ఈ ప్రక్రియ జులై వరకు కొనసాగుతుందని నిక్కీ అనే బిజినెస్ డైలీ తెలిపింది.