- ఇండియాలో అవకాశాలను వాడుకుని లబ్ధి పొందాలని సూచన వచ్చే ఐదేండ్లలో భారత్, జోర్డాన్ వ్యాపార భాగస్వామ్యాన్ని 45 వేల కోట్లకు పెంచుదామని పిలుపు
అమ్మాన్: భారత్ కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని జోర్డాన్ కంపెనీలకు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. భారత్ లో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని వాడుకుని మంచి రిటర్నులు పొందవచ్చని అన్నారు. అలాగే, వచ్చే ఐదేండ్లలో భారత్, జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యాన్ని రూ.45 వేల కోట్లకు పెంచుదామని ఆయన పిలుపునిచ్చారు. తన రెండు రోజుల జోర్డాన్ పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం ఆ దేశ రాజధాని అమ్మాన్ లో కింగ్ అబ్దుల్లా 2తో కలిసి ఇండియా–జోర్డాన్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, జోర్డాన్ మధ్య వ్యాపార భాగస్వామ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో జోర్డాన్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రెండు దేశాల్లో ఉన్న అవకాశాలను వాడుకుని వృద్ధిని సాధించాలన్నారు. ‘‘భారత్ లో బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది. అంతేకాకుండా స్థిరమైన, పారదర్శకమైన పాలసీ వాతావరణం ఉంది.
ఇండియాలో ఉన్న 140 కోట్ల వినియోగదారుల మార్కెట్ ను వాడుకుని లాభాలు పొందండి. వచ్చే ఐదేండ్లలో భారత్, జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని డబుల్ చేసి రూ.45 వేల కోట్లకు పెంచుదాం. డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, ఫిన్ టెక్, హెల్త్ టెక్, అగ్రిటెక్ వంటి రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫార్మా, మెడికల్ డివైజెస్ సెక్టార్లలో భారత్ బలంగా ఉంది. ఈ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని జోర్డాన్ ను పశ్చిమాసియా, ఆఫ్రికాకు ఒక నమ్మకమైన హబ్ గా చేయవచ్చు” అని మోదీ పేర్కొన్నారు.
మోదీని కారులో ఎక్కించుకుని..
ప్రధాని నరేంద్ర మోదీని జోర్డాన్ రాజకుమారుడు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా 2 కారులో ఎక్కించుకుని జోర్డాన్ మ్యూజియంకు తీసుకెళ్లారు. రాజకుమారుడే కారు నడిపి మోదీపై గౌరవాన్ని చాటుకున్నారు. జోర్డాన్ మ్యూజియం అమ్మాన్ జిల్లాలోని రాస్ అల్ ఈన్ లో ఉన్న దేశపు అతిపెద్ద మ్యూజియం. చారిత్రక కళాఖండాలు, పురాతన వస్తువులు, 15 లక్షల ఏండ్ల నాటి జంతువుల ఎముకలకు ఈ మ్యూజియం నిలయం. 2014లో ఈ మ్యూజియాన్ని నిర్మించారు.
