అగ్రికల్చర్ సీటుకు అడ్డగోలు రేటు.. ఒక్కో సీటుకు రూ. 14 లక్షలు

అగ్రికల్చర్ సీటుకు అడ్డగోలు రేటు.. ఒక్కో సీటుకు రూ. 14 లక్షలు
  • బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్​ సీటుకు రూ. 14 లక్షలు వసూలు
  • అగ్రి వర్సిటీపై కేంద్రానికి స్టూడెంట్ల కంప్లైంట్.. విచారణకు ఆదేశం

అగ్రికల్చర్‍, హార్టికల్చర్‍ వర్సిటీలో గ్రాడ్యుయేషన్‍ కోర్సుల పేమెంట్‍ సీట్లకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే స్టూడెంట్ల ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. విచారణకు ఆదేశించింది.

హైదరాబాద్‍, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ అగ్రికల్చర్‍, హార్టికల్చర్‍ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‍ కోర్సుల పేమెంట్‍ సీట్లకు ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారని స్టూడెంట్లు చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. పేమెంట్‍ సీట్ల ఫీజులు అత్యధికంగా వసూలు చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

అగ్రికల్చర్​లో 95 సీట్లు.. హార్టికల్చర్​లో 20 సీట్లు
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో పేమెంట్ కోటాలో 95 సీట్లు, బీఎస్సీ హార్టికల్చర్ పేమెంట్ కోటాలో 20 సీట్ల భర్తీకి డిసెంబర్​15న నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఒక్కొక్క పేమెంట్ సీటు ఖరీదు రూ.14 లక్షలుగా నిర్ణయించింది. మొదట రూ.10,12,890 డీడీ రూపంలో, రూ.37,110 నగదుగా చెల్లించాలని, మిగతా రూ.4 లక్షలు ఏటా రూ.50 వేల చొప్పున కట్టాలని నిబంధనల్లో పేర్కొంది. హాస్టల్‍, మెస్‍ చార్జీలు అదనంగా చెల్లించాలని నోటిఫికేషన్‍లో వెల్లడించింది. అంటే ఈ పేమెంట్‍ కోటా ఫిల్‍ అయితే మొత్తం 115 సీట్లకు గాను రూ.16.10 కోట్ల ఆదాయం వస్తుంది. పేమెంట్‍ కోటాకే ఇంత ఫీజు ఉండగా ఎన్‍ఆర్‍ఐ కోటాలో ఒక్కో సీటుకు రూ.34 లక్షలుగా ఉండటం గమనార్హం. 

ఎక్కువ ఫీజులతో భారం
ప్రభుత్వ వర్సిటీనే ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంపై ముగ్గురు విద్యార్థులు వేర్వేరుగా కేంద్రానికి కంప్లైంట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ఫీజు వసూలు చేయడం పేద విద్యార్థులకు భారంగా మారుతోందని తెలిపారు. దీంతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్‍ సెక్రటరీని కేంద్రం ఆదేశించింది. 

ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఇలా..
రాష్ట్రంలో అగ్రికల్చర్‍, హార్టికల్చర్‍ కోర్సులకు ప్రైవేటు కాలేజీలను అనుమతించలేదు. అయితే గతంలో రాష్ట్ర సర్కారు ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ కోర్సులకు బాగా డిమాండ్‍ పెరిగింది. దీంతో కొందరు స్టూడెంట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి గ్రాడ్యుయేషన్‍ డిగ్రీలు చేసి ఇక్కడ గెజిటెడ్‍ ఉద్యోగాలు పొందారు. దీంతో రాష్ట్రంలోనూ ఈ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. అయినా ఇటీవల అలాంటి ఉపాధి అవకాశాలేవి లేకపోగా ప్రభుత్వం నిర్వహించే యూనివర్సిటీలో పేమెంట్‍ ఫీజులు ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్ఆర్‍ఐ కోటాలో ఫీజు ఎక్కువగా ఉంటే సమస్య లేదని, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన పేమెంట్‍ సీటు ఫీజులు లక్షల్లో వసూలు చేస్తే ఎలా అని స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.