బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు ఫుల్ డిమాండ్

బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు ఫుల్ డిమాండ్
  • ఒక్కో సీటుకు 22 మంది కాంపిటీషన్ 
  • 1,500 సీట్లకు 33,005 దరఖాస్తులు  
  • ఆగస్టు రెండో వారంలో సీట్ల కేటాయింపు 

హైదరాబాద్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ ) సీట్లకు మస్త్ డిమాండ్ నెలకొంది. 2022-–23 విద్యా సంవత్సరానికి 1,500 సీట్లకు 33 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో సీటుకు 22 మంది స్టూడెంట్లు పోటీ పడుతున్నారు. ఆగస్టు రెండో  వారంలో సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. టెన్త్ మార్కులతో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు జూన్ 30న ఆర్జీయూకేటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 20 వరకూ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం1500 సీట్లుండగా 33,005 మంది స్టూడెంట్లు అప్లై చేసుకున్నారు. నిరుడు 22,350 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఈసారి దాదాపు 10 వేల దరఖాస్తులు పెరిగాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న లిస్టు ప్రకటిస్తామని  చెప్పినా, అప్లికేషన్లు భారీగా రావడంతో ప్రాసెస్ ఇంకా కొనసాగుతోంది. ఆగస్టు రెండో వారంలో సీట్లు అలాట్ చేసే అవకాశముందని అధికార వర్గాలు చెప్పాయి. అయితే ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్  కోటాపై ఉన్నత విద్యాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ఈ సీట్లను ఎలా భర్తీ చేయాలనే దానిపై ట్రిపుల్ ఐటీ అధికారుల్లో అయోమయం నెలకొన్నది. 

సర్కారీ స్టూడెంట్లకే ఎక్కువ సీట్లు..

బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు దాదాపు గ్రామీణ ప్రాంత మెరిట్ స్టూడెంట్లకే కేటాయిస్తారు. టెన్త్​లో10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సర్కారు స్కూళ్లలో చదివిన స్టూడెంట్లకు అదనంగా 0.4 జీపీఏ కలుపుతారు. దీంతో ఎక్కువ సీట్లు సర్కారీ స్టూడెంట్లకే వస్తుంటాయి.