మట్టి కుండ..సల్లగుండు..సమ్మర్ సీజన్ లో ఫుల్ గిరాకీ

మట్టి కుండ..సల్లగుండు..సమ్మర్ సీజన్ లో ఫుల్ గిరాకీ
  •  సిటీలో ఎక్కువగా అమ్మకాలు
  • గతం కంటే ఈసారి డిమాండ్  
  •  పెరిగిన కుండలు, బాటిల్స్, పాత్రల సేల్స్

మెహిదీపట్నం, వెలుగు :  సిటీలో ఎండలు మండుతున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మట్టి కుండలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇంట్లో ఫ్రిజ్ ఉన్నప్పటికీ సమ్మర్ లో మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిదని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్ లో మార్కెట్లోకి రకరకాల కుండలు వచ్చాయి. ఎండాకాలంలో ఫ్రిజ్ వాటర్ తాగడం ద్వారా జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తుండడంతో మట్టికుండల్లోని నీటిని తాగేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంటూ డాక్టర్లు కూడా చెబుతున్నారు.

దీంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి గిరాకీ పెరిగిందని కుండల తయారీదారులు,  అమ్మకందారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిటీలో సాధారణ కుండల నుంచి మోడ్రన్ కుండల వరకు సైజ్ ను బట్టి రూ.150 నుంచి అమ్ముతున్నారు. మట్టి బాటిల్స్, ఇతర వస్తువులు రూ.100 నుంచి  పలుకుతున్నాయి. మట్టి కుండలు, పెద్ద పెద్ద రంజన్లతో పాటు మట్టి పాత్రలు, గ్లాసులు, బాటిల్స్, మగ్స్, కూజలు, డిజైన్ మట్కా, చెంబు మట్కా, గుజరాతీ మట్కా, రాజస్థానీ మట్కా  తదితర వస్తులను తయారీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు.  

ఏడేళ్ల తర్వాత మళ్లీ డిమాండ్

గత ఏడేండ్లలో కుండలకు ఇంత గిరాకీ ఎప్పుడు లేదని తయారీదారులు చెబుతున్నారు. 2017లో ఎండలు ఇదే తీరుగా  ఎక్కువగా ఉండటంలో అప్పట్లోనూ ఇలానే డిమాండ్ ఏర్పడిందన్నారు. అయితే ప్రస్తుతం పనివాళ్లు దొరక్క తాము సరిపడా కుండలు తయ్యారు చేయలేకపోతున్నామంటున్నారు. ప్రస్తుతం మట్టి కుండలను సిటీతో పాటు మహబూబ్ నగర్,  కొడంగల్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. 

ఫుల్ డిమాండ్   

ఈ సీజన్ లో మట్టికుండలకు చాలా డిమాండ్ ఏర్పడింది. మట్టి కుండలు, గ్లాసులు, జగ్గులు, పాత్రలు వంటివి తయారు చేస్తుండగా.. వీటికి గిరాకీ ఎక్కువగా ఉంది. 

-బాలకిషన్, కుమ్మరవాడి, ఆసిఫ్ నగర్

గిరాకీ బాగుంది 

గతేడాదితో పోలిస్తే ఈసారి కుండలకు బాగా గిరాకీ ఉంది. ఇక్కడే తయారు చేసి అమ్ముతున్నా. ఎండలు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగింది.  

– దర్గా పాండు, విజయ నగర్ కాలనీ