యూజ్ అండ్ త్రో మాస్క్​లకు మస్తు డిమాండ్

యూజ్ అండ్ త్రో మాస్క్​లకు మస్తు డిమాండ్
  • 1ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తదనే భయంతో పెరిగిన వాడకం
  • సిటీలోని కంపెనీల్లో రా మెటీరియల్ కొరత​ 
  • ముంబయి, ఢిల్లీ నగరాలను ఆశ్రయిస్తున్న డీలర్లు 
  • హోల్​సేల్​ మార్కెట్​లో పెరిగిన రేట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో నమోదు కావడంతో థర్డ్ వేవ్ వస్తదనే భయంతో సిటిజన్లు మాస్కులపై ఫోకస్ పెట్టారు. దీంతో మళ్లీ మాస్క్ లకు డిమాండ్ ఏర్పడింది. మాస్క్ లేని వారికి రూ. వెయ్యి  ఫైన్ వేస్తామని ప్రభుత్వం హెచ్చరించ
డంతో ప్రతి ఒక్కరు వాడుతున్నారు. 15 రోజుల క్రితం వరకు మాస్క్​​లను పెద్దగా పట్టించుకోని వారు కూడా ప్రస్తుతం కొంటుండటంతో యూజ్ అండ్ త్రో సర్జికల్ మాస్క్ లకు మస్తు డిమాండ్ ఏర్పడింది. కంపెనీల్లో కూడా స్టాక్ లేకపోవడంతో రోజురోజుకి సర్జికల్ మాస్కుల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే నగరంలో ఉన్న డీలర్లకు సిటీతో పాటు జిల్లాల్లోని మెడికల్ స్టోర్లు, షాపుల  నుంచి  పెద్ద ఎత్తు ఆర్డర్లు వస్తున్నాయి. కానీ స్టాక్ లేకపోవడంతో కొన్నాళ్లు ఆగాలని వారు చెప్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తర్వాత మాస్క్​ల గురించి సిటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు.  ఎప్పుడు డిమాండ్ ఉంటుందో తెలియక కంపెనీలు రా మెటీరియల్​ను కూడా అందుబాటులో ఉంచుకోలేదు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మరోసారి మాస్క్ లు తప్పనిసరిగా వాడాల్సి రావడంతో ఒక్కసారిగా బల్క్ ఆర్డర్లు వస్తున్నాయని కంపెనీల నిర్వాహకులు అంటున్నారు. రా మెటీరియల్ అందుబాటులో లేక పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పటికీ మాస్క్ లను తయారుచేయలేకపోతున్నామని వారు డీలర్లకు వివరిస్తున్నారు. దీంతో డీలర్లు ఢిల్లీ, ముంబయి సిటీల్లోని కంపెనీలను ఆశ్రయిస్తున్నారు.  అక్కడ కూడా పరిస్థితి ఇలాగే ఉండటంతో ఆర్డర్ బుక్ చేసిన వారం తరువాత మాస్క్​లు వస్తున్నాయని డీలర్లు చెప్తున్నారు. ఒక్కసారిగా షార్టేజ్​ ఏర్పడటం, మరో పక్క డిమాండ్ వల్ల రేట్లు కూడా పెరిగాయంటున్నారు. హోల్​సేల్​లో మొన్నటి వరకు యూజ్ అండ్ త్రో మాస్క్ టూ ప్లయర్, త్రీ ప్లయర్  రూ. 2 నుంచి రూ. 3లకు దొరకగా.. ప్రస్తుతం వాటి రేట్లు డబుల్ అయినట్లు డీలర్లు చెప్తున్నారు. ఇలాగే షార్టేజ్​ఉంటే యూజ్ అండ్ త్రో మాస్క్ రేటు  రూ.10కి పెరగొచ్చంటున్నారు. ఎన్ –95 మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను రూ. 50కి అమ్ముతుండగా.. వీటి రేట్లు పెరిగే అవకాశముందని డీలర్లు చెప్తున్నారు.

సిటీ శివార్లలో 50 కంపెనీలు..
సిటీ శివారు ప్రాంతాల్లో దాదాపు 50 వరకు మాస్క్ తయారీల కంపెనీలు ఉన్నాయి.  కరోనా కేసులు మొదలైనప్పుడు  ఒక్కో కంపెనీలో డైలీ 30 వేల నుంచి లక్ష వరకు మాస్క్​లు తయారయ్యేవి.  అప్పట్లో డిమాండ్ ఉండటంతో అందుకు తగట్లు ప్రొడక్షన్ ఉండేది.  కరోనా కేసులు తగ్గుతున్న కొద్దీ డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్​ తర్వాత పూర్తిగా డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు రా మెటీరియల్​ స్టాక్​ను​ పెట్టుకోలేదు. ఇప్పుడు ఒమిక్రాన్ భయంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మాస్క్​లు కావాలంటూ కంపెనీలకు ఆర్డర్లు వస్తున్నాయి. రా మెటీరియల్ లేదని, మాస్క్ ల తయారీకి కొంచెం టైమ్ పడుతుందని వారు డీలర్లకు చెప్తున్నారు. 
ప్రస్తుతం రా మెటీరియల్​ రేట్లు కూడా పెరగడంతో ఆ ప్రభావం మాస్క్ ల తయారీపై పడిందంటున్నారు.  

ఇతర రాష్ట్రాలను నుంచి సప్లయ్
సిటీలో దాదాపు 3 వేల మంది డీలర్లు ఉన్నారు.  ఇక్కడి కంపెనీల్లో స్టాక్ లేకపోవడంతో ఢిల్లీ, ముంబయితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి యూజ్ అండ్ త్రో మాస్క్ లను డీలర్లు తెప్పిస్తున్నారు. డిమాండ్ ఉండటంతో కస్టమర్లు ఇతరులను ఆశ్రయించకుండా ఉండేందుకు రేటు ఎక్కవైనా తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉండటంతో ఆర్డర్ చేసిన వారం రోజుల తర్వాత డీలర్లకు మాస్క్ లు సప్లయ్ అవుతున్నాయి. మార్కెట్​లో దొరికే అన్ని మాస్క్ లు సేఫ్ కాదని డీలర్లు అంటున్నారు.  క్వాలిటీ లేని మాస్క్​లను వాడటం మంచిది కాదని చెప్తున్నారు. 

ప్రొడక్షన్ తగ్గించాం
డిమాండ్ ఎప్పుడు ఉంటుందో తెలియక ఈసారి స్టాక్ ఉంచలే. గతంలో తయారు చేసిన మాస్క్ ల స్టాక్ అయిపోయేందుకు టైమ్ పట్టడంతో  ప్రొడక్షన్ తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు డిమాండ్ అయితే ఎక్కువగానే ఉంది. కానీ ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. 
- మల్లిఖార్జున్, మాస్క్​ల కంపెనీ నిర్వాహకుడు, ఇస్నాపూర్, పటాన్​చెరు.

60 శాతం బిజినెస్ పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో యూజ్ అండ్ త్రో మాస్క్​లకు ఒక్కసారిగా డిమాండ్  ఏర్పడింది.   వారం రోజుల్లో 60 శాతం వరకు బిజినెస్​ పెరిగింది. సిటీతో పాటు జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. సిటీలోని కంపెనీల్లో  రా మెటీరియల్​ లేకపోవడంతో ఢిల్లీ, ముంబయి నుంచి మాస్క్​లను తెప్పిస్తున్నం. అక్కడ కూడా డిమాండ్ ఉండటంతో కాస్త ఆలస్యం అవుతోంది. 
- నరేష్ సాగర్, డీలర్, షేక్ పేట

ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్
జనాలు అలర్ట్​గా లేకపోతే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముంది. ప్రతి ఒక్కరు  తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి. గతంలో కంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవడం బెటర్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్​గా ఉండొచ్చు.  
- డాక్టర్ విజయ్​ భాస్కర్ , రవి హిలీయోస్ హాస్పిటల్, దోమలగూడ